Pawan Kalyan: ఆడపడుచులకు నగదు బదిలీ, ఉచిత వంట గ్యాస్: పవన్ కల్యాణ్ హామీల వర్షం
- అగ్రకుల యువతకు ఈబీసీ హాస్టళ్లు
- బీసీ కులాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు
- జగన్, చంద్రబాబు ఇద్దరూ ఇద్దరేనన్న పవన్ కల్యాణ్
మహిళల భద్రత విషయంలో ఎక్కడా రాజీపడబోమని, అవినీతి రహిత పాలన ద్వారా ఆడబడుచులకు నగదు బదిలీ చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. జనసేన పోరాటయాత్రలో భాగంగా తణుకు పట్టణంలో బహిరంగ సభ నిర్వహించిన పవన్ కల్యాణ్, పేదలకు రూపాయి బియ్యం బదులు నిత్యావసరాలకి రూ. 2500 నుంచి రూ. 3500 ఇస్తామని హామీ ఇచ్చారు.
ఆడపడుచులను ఇబ్బంది పెట్టిన వాళ్ల తోలు తీస్తానని హెచ్చరించారు. అగ్రకులాల్లోని యువతకు ఈబీసీ హాస్టళ్లు ఏర్పాటు చేస్తామని, బీసీ కులాలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తానని చెప్పారు. జగన్ లక్ష కోట్లు దోచేస్తే, చంద్రబాబు లక్షన్నర కోట్లు దోచేసి, ప్రజాక్షేమాన్ని గాలికి వదిలేశారని పవన్ ఆరోపించారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా దోస్తే, టీడీపీ చట్టబద్ధంగా దోచిందని, భవిష్యత్తులో ఓటు వేసేటప్పుడు పిల్లల భవిష్యత్తును ఆలోచించాలని సూచించారు. 'దేవుడా రక్షించు నా దేశాన్ని... పెద్ద పులుల నుంచి, పెద్ద మనుషుల నుంచి...' అన్న ప్రముఖ కవి దేవరకొండ బాల గంగాధర్ తిలక్ రాసిన కవితను ఉటంకిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, తిలక్ ఎప్పుడో రాసిన ఈ కవిత నేటి రాజకీయ నాయకుల దోపిడీకి నిదర్శనంగా నిలిచిందని అన్నారు. లక్షల కోట్ల అవినీతి జరుగకుండా ఉంటే, ఆడపడుచులకు నగదు బదిలీ, ఉచిత గ్యాస్ సిలిండర్ సాధ్యమేనని అన్నారు. చంద్రబాబు ఇస్తున్న రూపాయి బియ్యం కోళ్లకు దాణాగానూ, సారా బట్టీలకూ పోతున్నాయని, దాని బదులు మహిళల ఖాతాలో నెలకింతని డబ్బులు వేస్తే, నిత్యావసరాలకు నిజంగా ఉపయోగపడతాయని అన్నారు.