Telangana: రాత్రివేళ మందీమార్బలంతో మహిళా వీఆర్వో ఇంటికెళ్లిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. హడలిపోయిన వీఆర్వో!
- మరోమారు వివాదాస్పదమైన ముత్తిరెడ్డి తీరు
- అనుచరుడికి పట్టా చేయించేందుకు రాత్రివేళ వీఆర్వో ఇంటికి
- నేడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్న వీఆర్వో
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూమికి సంబంధించి తన అనుచరుడికి పట్టా చేయించేందుకు రాత్రివేళ మందీమార్బలంతో కలిసి పెంబర్తి వీఆర్వో ఇంటికెళ్లారు. వారందరినీ చూసిన మహిళా వీఆర్వో పద్మ హడలిపోయారు.
శనివారం రాత్రి ఈ ఘటన జరగ్గా ఆమె ఈ విషయాన్ని వీఆర్వోల సంఘం, టీఎన్‌జీవోల సంఘం నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. నేడు వీరంతా కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. టీఎన్‌జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజయ్య, వీఆర్వో సంఘం జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రాత్రివేళ వీఆర్వో పద్మ ఇంటికి వెళ్లి ఒత్తిడి తీసుకొచ్చిన మాట వాస్తవమేనన్నారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా నేడు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఈ వివాదంపై ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. వీఆర్వో ఇంటికి వెళ్లిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఓ వెంచర్‌కు సంబంధించి పట్టా చేసే విషయంలో జాప్యం జరుగుతుండడంతో బాధితులు తనతో మొరపెట్టుకున్నారని తెలిపారు. అందుకనే వీఆర్వో ఇంటికి వెళ్లి మాట్లాడినట్టు చెప్పారు. అయితే, ఉదయం కార్యాలయంలో కలవకుండా రాత్రివేళ ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.