Chandrababu: టీడీపీ నేతలు బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా?: వైసీపీ నేత అంబటి రాంబాబు

  • వైఎస్ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు
  • దీనికి ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోంది
  • బీజేపీతో జగన్ కుమ్మక్కైతే ఈడీ కేసు ఎందుకు పెట్టింది?

కాంగ్రెస్, టీడీపీ రెండు పార్టీలు కలిసి కేసులు వేసి జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా వేధిస్తున్నాయని, ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ఆదరణ చూడలేక చివరికి, వైఎస్ భారతిని కూడా కోర్టుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని  వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలపై నిప్పులు చెరిగారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని అపహాస్యం పాలు చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని, వైఎస్ మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నారని, దీనికి ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. బీజేపీతో వైఎస్ జగన్ కుమ్మక్కయితే ఈడీ కేసు ఎందుకు పెట్టింది? టీడీపీ నేతలు బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు.

జగన్ పై కేసులు పెట్టి జైలులో పెడితే గెలవొచ్చన్న తాపత్రయం చంద్రబాబుదని, గత ఎన్నికల సమయంలో జగన్ లక్ష కోట్లు దోచుకున్నాడని ప్రచారం చేశారని, ఇప్పుడేమో దానిని రూ.43 వేల కోట్లు అంటున్నారని టీడీపీ నాయకులపై ఆయన మండిపడ్డారు. టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నట్టు అది రూ.43 వేల కోట్లు అయితే, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, కేవలం రూ.1200 కోట్లకు సంబంధించి మాత్రమే కేసు నడుస్తోందని అంబటి తెలిపారు.

తమ గ్రూప్ కంపెనీలలో కీలకపాత్ర పోషిస్తున్న వైఎస్ భారతికి భారీ జీతం అందుతోందని ఎల్లో మీడియాలో రాశారని, ఆమెకు జీతం ఇచ్చే విషయం ఆయా కంపెనీలు నిర్ణయించుకుంటాయని, ప్రభుత్వమేమీ ఇవ్వడం లేదుగా? అని అంబటి ప్రశ్నించారు. ‘హెరిటేజ్’ సంస్థలో ఏం జరుగుతుందో మేం అడుగుతున్నామా? హెరిటేజ్’లో మీరు ఎన్ని కుంభకోణాలకు పాల్పడ్డారో బయటకు రాకపోవచ్చు. ‘హెరిటేజ్’ గ్రూప్ ను ‘ఫ్యూచర్’ గ్రూప్ నకు అమ్మినప్పుడు ఎన్నివేల కోట్ల రూపాయలు కుంభకోణం చేశారో సమయం వచ్చినప్పుడు బయటకొస్తుంది' అని అన్నారు.

ఈడీ డిపార్టుమెంట్ లో బాధ్యత గల పదవుల్లో ఉమాశంకర్ గౌడ్, గాంధీ ఉన్నారని.. వాళ్ల కాల్ డేటా, చంద్రబాబు పక్కన ఉండే వాళ్ల కాల్ డేటాను బయటకు తీస్తే మొత్తం బయటపడిపోతుందని అన్నారు. వారి కాల్ డేటాను బయటకు తీయాలని డిమాండ్ చేశారు. ప్రతి వ్యవస్థలోను తను పెట్టే గడ్డి తిని, తనకు అనుకూలంగా పని చేసే వ్యక్తులను చంద్రబాబు చొప్పించుకున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.

  • Loading...

More Telugu News