Roja: ఏపీ మంత్రులు మగవాళ్లో, ఆడవాళ్లో తెలియడం లేదు: మండిపడ్డ రోజా

  • అట్టడుగు స్థాయికి దిగజారిన మంత్రులు
  • తెలుగుదేశం నేతలది నీచ రాజకీయం
  • ఓ కేసులో ఏడేళ్ల తరువాత ఆడవాళ్ల పేర్లు చేరుస్తారా?

ఆంధ్రప్రదేశ్ మంత్రులు అట్టడుగు స్థాయికి దిగజారి వైకాపా అధినేత వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారని, వారు మగవాళ్లో, ఆడవాళ్లో తెలియడం లేదని నగరి ఎమ్మెల్యే రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేడు ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం నేతలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ సతీమణి భారతిని కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఓ కేసులో ఏడు సంవత్సరాల తరువాత జగన్ భార్య భారతి పేరును చేర్చడమేంటని ప్రశ్నించిన ఆమె, ఓ కుట్ర ప్రకారం ఇదంతా జరుగుతోందని నిప్పులు చెరిగారు.

బీజేపీ, కాంగ్రెస్ లతో కుమ్మక్కైన టీడీపీ నేతలు విర్రవీగిపోతున్నారని, వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. మీ ఇంట్లోని వాళ్లను కూడా ఇలాగే కోర్టుకు లాగే పరిస్థితి వస్తుందని అన్నారు. ఏపీని దోచుకుంటున్న చంద్రబాబు, దాన్ని సింగపూర్ లో దాచుకుంటున్నారని విమర్శించారు. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, వైఎస్ జగన్ పై ఉన్న కేసులన్నీ వీగిపోనున్నాయని, ఈ విషయం తెలిసి తట్టుకోలేని చంద్రబాబు సర్కారు వైఎస్ భారతి పేరును తెచ్చి రాద్ధాంతం చేస్తోందని రోజా మండిపడ్డారు.

బీజేపీతో కొట్లాడుతున్నట్టు టీడీపీ నాటకం ఆడుతోందని, పార్లమెంట్ లో వైసీపీ పెట్టిన అవిశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కాలయాపన చేసి, ఆపై టీడీపీ పెట్టిన అవిశ్వాసంపై చర్చ చేపట్టారని, కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకన్నా నిదర్శనం ఏంటని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికినా ఇంతవరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని, బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టిన సుజనా చౌదరి కూడా దర్జాగా తిరుగుతున్నారని, అటువంటి వారంతా భారతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని రోజా అన్నారు. వైఎస్ జగన్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. 

  • Loading...

More Telugu News