Krishna River: మళ్లీ కృష్ణలో జలకళ... తుంగభద్ర నుంచి లక్షన్నర క్యూసెక్కుల వరద శ్రీశైలానికి!
- ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు
- తుంగభద్ర 30 గేట్లనూ ఎత్తివేసిన అధికారులు
- మూడు వారాల తరువాత శ్రీశైలానికి మళ్లీ వరద నీరు
కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మకు మరోసారి జలకళ వచ్చింది. తుంగభద్ర జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో, దిగువన ఉన్న శ్రీశైలానికి నీటిని వదులుతున్నారు. 88 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటం, ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం మరింతగా పెరగనుందన్న అంచనాలతో 30 గేట్లనూ ఎత్తి, లక్షా 40 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతూ, జలాశయాన్ని కొంత ఖాళీ చేస్తున్నారు.
తుంగభద్ర రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 100 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 96.5 టీఎంసీల నీరుంది. ఈ నీరు రేపటికి శ్రీశైలానికి చేరనుంది. గత నెలలో శ్రీశైలానికి సుమారు 70 టీఎంసీల వరద నీరు వచ్చిన తరువాత, వరుణుడు ముఖం చాటగా, అప్పటి నుంచి శ్రీశైలం నీటిమట్టం పెరుగుదల నమోదు కాలేదు. 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న ప్రాజెక్టులో ప్రస్తుతం 139 టీఎంసీల నీరుంది.