Jagan: వైఎస్ భారతి వార్షిక వేతనం రూ. 3.90 కోట్లు... జగన్ తరువాత ఆమే కీలకం: చార్జ్ షీట్ లో ఈడీ
- మనీ లాండరింగ్ లో భారతి శిక్షార్హురాలు
- మూడు సార్లు సమన్లు పంపినా విచారణకు రాలేదు
- అన్ని లావాదేవీల్లో సంతకాలు ఆమెవే
- ఐదో నంబర్ నిందితురాలిగా భారతి పేరు
తన గ్రూప్ కంపెనీల నుంచి వైఎస్ జగన్ డైరెక్టరుగా వైదొలగిన తరువాత జగన్ సతీమణి భారతి కీలక పాత్రను పోషిస్తున్నారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన చార్జ్ షీట్ లో పేర్కొంది. ఆమెకు సాలీనా రూ. 3.90 కోట్ల వేతనం అందుతోందని, సంస్థలోని మెజారిటీ షేర్ హోల్డర్లకు కూడా అంత వేతనం లేదని, మనీ లాండరింగ్ లో ఆమె శిక్షార్హురాలని తెలిపింది. గతంలో మూడు సార్లు తాము సమన్లు పంపినా, ఆమె విచారణకు రాలేదని కూడా ఈడీ పేర్కొన్నట్టు తెలుస్తోంది. గ్రూప్ కంపెనీల్లో నిధుల బదిలీ, ఆడిట్ బ్యాలెన్స్ షీట్లపై ఆమే సంతకం చేస్తున్నట్టు కూడా ఈడీ తెలిపింది.
కాగా, భారతీ సిమెంట్స్ కేసులో 19 మంది నిందితులుండగా, భారతిని ఐదో నిందితురాలిగా ఈడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. నేర పూరిత చర్యల వల్ల అందుతున్న లాభాలను ఆమె అనుభవిస్తున్నారని పేర్కొంది. 'పర్ఫిసిమ్' సంస్థకు జగన్ తన వాటాలను విక్రయించగా, ఆపై భారీ స్థాయిలో నిధులు భారతికి లభించాయని, వాటినే జగన్ కు చెందిన పలు కంపెనీల్లో ఇన్వెస్ట్ మెంట్ గా భారతి చూపించారని ఈడీ పేర్కొంది. జగన్, భారతిల అంగీకారంతోనే భారతి సిమెంట్స్, సండూర్ పవర్, సిలికాన్ బిల్డర్స్, సరస్వతి పవర్, క్యాప్ స్టోన్ ఇన్ ఫ్రా తదితర కంపెనీల్లో మనీ లాండరింగ్ జరిగిందని తెలిపింది.
భారతీ సిమెంట్స్ లో 51 శాతం వాటా ఉన్న పర్ఫిసిమ్ డైరెక్టర్ల కన్నా భారతికి అధిక వేతనం వస్తోందని, 2006-17లో సంవత్సరానికి రూ. 17.5 లక్షల వేతనాన్ని క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి తీసుకున్న ఆమె, 2010 డిసెంబర్ 12న భారతీ సిమెంట్స్ చైర్ పర్సన్ అయిన తరువాత రూ. 3.90 కోట్ల వేతనాన్ని అందుకున్నారని తెలిపింది. గత ఐదేళ్లలో ఆమె రూ. 19.50 కోట్ల వేతనాన్ని అందుకున్నారని, మెజారిటీ వాటాలున్న డైరెక్టర్లకు అందులో సగం మొత్తమే వేతనంగా లభించిందని తెలిపింది.