Pawan Kalyan: మేము అధికారంలో కొస్తే కాపులకు 9వ షెడ్యూల్ లో రిజర్వేషన్ కలిపిస్తాం!: పవన్ కల్యాణ్
- బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తా
- మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ ఇస్తాం
- ‘జనసేన’ మానవత్వానికి అండగా ఉంటుంది
తాము అధికారంలోకి వస్తే బీసీలకు జనాభా ప్రాతిపదికన, కాపులకు 9వ షెడ్యూల్ లో రిజర్వేషన్ కల్పిస్తామని, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం మార్టేరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కులాలకు సరైన ప్రాతినిధ్యం చట్టసభల్లో లేనందునే ఆయా కులాల వారు వెనుకబడుతున్నారని అన్నారు. జనసేన పార్టీ కులాలకు కాదు, మానవత్వానికి అండగా ఉంటుందని, మహిళల అత్యాచారాలపై మాట్లాడే వారే లేకపోవడం బాధాకరమని అన్నారు.
రాజకీయాల్లో బాధ్యత కలిగినవారే ఉండాలని, రాజకీయ నాయకులు మాటలు తప్పుతుంటే బాధ కలిగి, ప్రజలకు అండగా నిలబడి, వారి సమస్యలపై పోరాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి అనుభవజ్ఞుడు అవసరమని నాడు టీడీపీకి మద్దతు ఇచ్చామని, ప్రశ్నించే వారిని దోపిడీలు చేస్తున్న వాళ్లు తిడుతుంటే చూస్తూ కూర్చోమని హెచ్చరించారు. ఎవరైనా మీకు అనుకూలంగా ఉంటే మంచివాళ్లు.. లేకపోతే కనుక చెడ్డవాళ్లా? అని ప్రశ్నించిన పవన్, 'చంద్రబాబులా కులాల మధ్య చిచ్చు పెట్టను, ప్రజలకు సమ న్యాయం చేస్తా'నని హామీ ఇచ్చారు.