vishal: కేరళకు సాయం చేద్దాం రండి.. ప్రజలకు నటుడు విశాల్ పిలుపు

- విరాళాలు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి
- రేపు చెన్నైలోని మహాలింగపురంలో సేకరిస్తామని వెల్లడి
- నిత్యావసర, ఆహార వస్తువులను ఇవ్వాలని కోరిన నటుడు
గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా 54,000 మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రజలను ఆదుకునేందుకు ప్రముఖ తమిళ హీరో విశాల్ ముందుకొచ్చాడు.
మలయాళీలకు సాయం చేసేందుకు ‘కేరళ రెస్క్యూ’ పేరుతో విరాళాలు సేకరించనున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించాడు. రేపు చెన్నైలోని మహాలింగపురంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విరాళాలు సేకరిస్తామని విశాల్ తెలిపాడు. వయనాడ్ జిల్లాలో ఉన్న వరద బాధితుల కోసం వాటర్ బాటిళ్లు, సబ్బులు, టూత్ బ్రష్, పేస్ట్, టవల్స్, దుప్పట్లు, బెడ్ షీట్స్, మందులు,బిస్కెట్ ప్యాకెట్లు, క్యాండిల్స్, శానిటరీ ప్యాడ్స్, డైపర్స్, దోమతెరలు, డెటాల్ వంటి వస్తువుల్ని అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.
