wife: భార్య అందంపై కామెంట్లను భరించలేక.. ఆమెను అమ్మేయబోయాడు!: ఢిల్లీలో ఓ ప్రబుద్ధుడి నిర్వాకం
- తొలుత హత్య చేసేందుకు పథకం
- అనంతరం వ్యభిచార గృహానికి అమ్మాలని నిర్ణయం
- బాధితురాలిని కాపాడిన పోలీసులు
కట్టుకున్న భార్యను కాలు కింద పెట్టకుండా చూసుకునే భర్తలు ఉంటారు. ఆమె కోరిన దాన్ని క్షణాల్లో తీసుకొచ్చి ముందు పెట్టేవారూ ఉంటారు. కానీ బిహార్ లోని వ్యక్తి మాత్రం అందంగా ఉన్న తన భార్యను అందరూ చూస్తున్నారన్న ఈర్ష్యతో ఆమెను చంపేయాలనుకున్నాడు. చివరికి మనసు మార్చుకుని ఆమెను ఢిల్లీలోని వ్యభిచార గృహానికి అమ్మేందుకు యత్నించాడు.
బిహార్ లోని అరారియాకు చెందిన సద్దాం(32) మొదటి భార్య, పిల్లలతో కలసి ఢిల్లీలో ఉంటున్నాడు. అయితే, మొదటి భార్య ఉండగానే మరో మహిళ(28) అందానికి ఆకర్షితుడై ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను వేరే చోట ఇల్లు తీసుకుని ఉంచాడు.
అయితే, అతను ఏ అందాన్నయితే చూసి ఆమెను పెళ్లి చేసుకున్నాడో ఆ అందమే ఆమెకు అ తర్వాత శాపంగా మారింది. బయటకు వెళ్లినప్పుడు ఆమె అందాన్ని మగాళ్ళంతా తేరిపార చూసేవారు. దాంతో పక్కనే వుండే సద్దాం దానిని భరించలేకపోయేవాడు. తర్వాత అది ఈర్ష్యగా మారింది. ఆమె అందాన్ని చూసి కొందరు కామెంట్లు కూడా చేస్తుండడంతో ఆమెపై అసూయ, ద్వేషం పెంచుకున్నాడు. దాంతో ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు.
ఈ నేపథ్యంలో రెండో భార్యను చంపేందుకు ఢిల్లీలోని ఓ మార్కెట్ లో కత్తిని కొన్నాడు. అయితే, అంతలోనే మనసు మార్చుకుని ఆమెను చంపడం కన్నా, వ్యభిచార గృహానికి అమ్మేస్తే తనకు డబ్బులు కూడా వస్తాయనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా వ్యభిచార గృహాల నిర్వాహకులు, విటులను కలసి బేరసారాలు చేశాడు.
చివరికి భార్యను రూ.1.20 లక్షలకు ఓ విటుడికి అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నాడు. అయితే అక్కడ విటుడిగా ఉన్నది ఓ పోలీస్ ఇన్ఫార్మర్ కావడంతో అతను అధికారులకు సమాచారం అందించాడు. చివరికి రూ.10 వేల అడ్వాన్స్ తీసుకున్న సద్దాం.. భార్యకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. అక్కడ బలవంతంగా అతనికి అప్పగిస్తుండగా అప్పటికే మఫ్టీలో ఉన్న పోలీసులు నిందితుడ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ మహిళను కాపాడారు.