lords: రెండో టెస్ట్ లో చేతులెత్తేసిన టీం ఇండియా.. 107 పరుగులకే ఆలౌట్!
- లార్డ్స్ లో భారత బ్యాట్స్ మెన్ ఘోర వైఫల్యం
- టీమిండియా పతనాన్ని శాసించిన అండర్సన్
- టాప్ స్కోరర్ గా నిలిచిన అశ్విన్
ఎడ్జ్ బాస్టన్ లో కొంచెం గౌరవప్రదంగా పోరాడి ఓడిన టీం ఇండియా లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో చేతులెత్తేసింది. ఇంగ్లండ్ పేస్ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు టాప్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన రెండో రోజు ఆటలో కేవలం 35.2 ఓవర్లకే 107 పరుగులకు అన్ని వికెట్లను సమర్పించుకుంది. జట్టులో టెయిలెండర్ అశ్విన్(28; 4x4) టాప్ సోర్కర్ గా నిలిచాడంటే భారత బ్యాట్స్ మెన్ ఎంత దారుణంగా విఫలమయ్యారో అర్థం చేసుకోవచ్చు.
వర్షం పడటం, వాతావరణం పిచ్ లపై ఉన్న తేమతో ఇంగ్లండ్ బౌలర్లు రెచ్చిపోయారు. అండర్సన్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికే మురళీ విజయ్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఇక భారత్ వికెట్ల పతనం ప్రారంభమయింది. విజయ్ ను ఔట్ చేసిన అండర్సన్ మరో చక్కటి డెలివరీతో కేఎల్ రాహుల్(8)ను పెవిలియన్ కు పంపాడు. దీంతో 11 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం వర్షం పడటంతో ఆట ఆగిపోయింది. మధ్యాహ్నం ఆట మళ్లీ మొదలు కాగా, కోహ్లితో సమన్వయం కొరవడటంతో పుజారా రనౌట్ గా వెనుదిరగాల్సి వచ్చింది.
ఆ తర్వాత కెప్టెన్ కోహ్లి(23; 70 బంతుల్లో 2x4), రహానే(18;44 బంతుల్లో 2x4) కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా ప్రయోజనం లేకపోయింది. చివరికి టెయిలెండర్లలో అశ్విన్(29; 49 బంతుల్లో 4x4) కొద్దిసేపు పోరాడాడు. అతనికి మిగిలిన ఆటగాళ్లు సహకారం అందించకపోవడంతో 107 పరుగులకే భారత ఇన్నింగ్స్ ముగిసింది. ఐదు వికెట్లతో అండర్సన్ భారత్ పతనాన్ని శాసించాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్:
విజయ్ (బి) అండర్సన్ 0; రాహుల్ (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 8; పుజారా రనౌట్ 1; కోహ్లి (సి) బట్లర్ (బి) వోక్స్ 23; రహానె (సి) కుక్ (బి) అండర్సన్ 18; పాండ్య (సి) బట్లర్ (బి) వోక్స్ 11; దినేశ్ కార్తీక్ (బి) కరన్ 1; అశ్విన్ ఎల్బీ (బి) బ్రాడ్ 29; కుల్‌దీప్ యాదవ్ ఎల్బీ (బి) అండర్సన్ 0; షమి నాటౌట్ 10; ఇషాంత్ ఎల్బీ అండర్సన్ 0; ఎక్స్‌ట్రాలు 5;
వికెట్ల పతనం: 1-0, 2-10, 3-15, 4-49, 5-61, 6-62, 7-84, 8-96, 9-96;
బౌలింగ్: అండర్సన్ 13.2-5-20-5; బ్రాడ్ 10-2-37-1; వోక్స్ 6-2-19-2; కరన్ 6-0-26-1;
మొత్తం: (35.2 ఓవర్లలో ఆలౌట్) 107;