Telangana: ముందస్తుకు సిద్ధమవుతున్న కేసీఆర్.. అక్టోబరులో శాసనసభ రద్దు?
- మోదీతో పదేపదే భేటీ వెనక ఉన్న మర్మమిదే
- ఢిల్లీలో విస్తృత చర్చ
- లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సహకరిస్తామంటూ ప్రతిపాదన?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారా? నవంబరు, డిసెంబరులో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలతోపాటే తెలంగాణలోనూ ఎన్నికల నిర్వహణకు కేసీఆర్ పావులు కదుపుతున్నారా?.. వీటికి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ విషయంలో ఆయన పక్కా ప్రణాళికతో ఉన్నట్టు చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ప్రధాని మోదీని కలిసిన సందర్భంగా ఈ విషయంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నామని, సహకరించాలని మోదీని కోరినట్టు ఢిల్లీ సమాచారం. బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో సార్వత్రిక ఎన్నికలతో పాటు వెళ్తే ఆ ప్రభావం తమపై పడే అవకాశం ఉండడంతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ముందస్తు కోసమే మోదీతో కేసీఆర్ పదేపదే భేటీ అవుతున్నారన్న చర్చ జరుగుతోంది.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే రాజకీయంగా తమకు కొన్ని సమస్యలు ఉంటాయని, కాంగ్రెస్ బలపడకముందే ఎన్నికలకు వెళ్లడం ద్వారా ప్రయోజనం ఉంటుందని మోదీతో కేసీఆర్ చెప్పారట. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తిగా సహకరిస్తామని మోదీకి మాట కూడా ఇచ్చారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రతిపాదనకు మోదీ సానుకూలంగా స్పందించినట్టు చెబుతున్నారు. దీంతో అక్టోబరులోనే శాసనసభను రద్దు చేయాలన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టు ఢిల్లీలో విస్తృత చర్చ జరుగుతోంది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలను సార్వత్రిక ఎన్నికల వరకు వాయిదా వేయకుంటే కనుక వాటితోపాటు తెలంగాణలోనూ ఎన్నికల నిర్వహణ తప్పదన్న వాదన బలంగా వినిపిస్తోంది.