Venkaiah Naidu: మోదీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన వెంకయ్య!

  • వికటించిన మోదీ చమత్కారం
  • హరిప్రసాద్ అమ్ముడుపోయినట్టు వ్యాఖ్యలు
  • చెలరేగిన వివాదం.. కాంగ్రెస్ ఫిర్యాదు

ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు రికార్డుల నుంచి వాటిని తొలగించారు. ప్రధాని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి అయిన హరివంశ్‌ నారాయణ్ సింగ్ (జేడీయూ) గెలిచారు. ఫలితాలు వెలువడిన అనంతరం రాజ్యసభకు వచ్చిన మోదీ డిప్యూటీ చైర్మన్‌ను అభినందించేందుకు ప్రసంగించారు.

మోదీ తనదైన శైలిలో ప్రసంగిస్తూ ‘‘దోనో తరఫ్ హరి థే. ఏక్ కే ఆగే బి.కే. థా! బి.కే హరీ కోయి నా బికే థా. యహా పే జో హరి కో బికే వో బి.కే నహీ థా!’’ అని పేర్కొన్నారు. దీనికి.. ‘‘ఇరు వైపులా హరి అన్న పేరు కలిగిన వ్యక్తులే ఉన్నారు. ఒకరి ఇంటి పేరు బి.కె. కానీ ఆయన అమ్ముడు (బికే) పోలేదు. ఇక్కడ అమ్ముడు పోయిన (బికే) హరి మరొకరు ఉన్నారు. కానీ ఆయన బి.కె. కాదు’’ అని చమత్కరించారు.

సభ్యులు గెలిపించలేదు.. అన్న అర్థంలో బికేను వాడాలనుకున్నా అది అమ్ముడుపోయిన అర్థం స్ఫురించడంతో వివాదాస్పదమైంది. తాను అమ్ముడుపోయానని అంటారా? అంటూ ఓటమి పాలైన హరిప్రసాద్ మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ దేశ ఖ్యాతిని దిగజార్చారని, ఆయన వ్యాఖ్యలు సిగ్గు చేటని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ అన్నారు. మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన వెంకయ్య మోదీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. 

  • Loading...

More Telugu News