Amaravathi: బిడ్డింగ్‌కు సిద్ధమైన అమరావతి బాండ్లు.. రాజధాని నిర్మాణానికి నిధుల సేకరణకు ప్రభుత్వం రెడీ!
- సిద్ధమైన అమరావతి బాండ్లు
- రూ.2 వేల కోట్లు సమీకరించడమే లక్ష్యం
- మరో నాలుగు రోజుల్లో బిడ్డింగ్‌కు
పెట్టుబడిదారుల నుంచి రూ. 2 వేల కోట్లను సేకరించే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి బాండ్లు బిడ్డింగ్‌కు రెడీ అయ్యాయి. ఈ నెల 14 లేదంటే 15వ తేదీల్లో ఇవి బిడ్డింగ్‌కు రానున్నట్టు సమాచారం. ఏపీ సీఆర్డీఏ జారీ చేస్తున్న ఈ బాండ్లపై పెట్టుబడిదారులకు 10.32 శాతం త్రైమాసిక వడ్డీ చెల్లిస్తారు. ఈ మొత్తం ప్రక్రియకు ఏకే క్యాపిటల్ సర్వీసెస్ మర్చంట్ బ్యాంకర్‌గా వ్యవహరిస్తోంది. దీంతో ఈ సంస్థకు 0.85 శాతం (జీఎస్టీ అదనం) ఇచ్చేందుకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బీఎస్‌ఈ), ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ప్లాట్‌ఫాం (ఈబీపీ) విధానంలో బిడ్డింగ్ నిర్వహించాల్సి ఉండడంతో ప్రభుత్వం నియమించిన స్టాండింగ్ కమిటీ సభ్యులతో చర్చించిన అనంతరం ఈ బాండ్లను అప్‌లోడ్ చేయాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. శుక్రవారం కనుక స్టాండింగ్ కమిటీ నుంచి అంగీకారం లభిస్తే వెంటనే అప్‌లోడ్ చేసేస్తారు. మంగళవారం బిడ్డింగ్ జరుగుతుంది. నేడు కనుక అప్‌లోడింగ్ సాధ్యం కాకుంటే సోమవారం పూర్తి చేసి బుధవారం బిడ్డింగ్ నిర్వహిస్తారు.