Tamilnadu: కరుణానిధి నాస్తికుడే అయినా స్వర్గానికే వెళ్లాడు: అతి కొద్దిమందికే ఆ అదృష్టమంటున్న తమిళనాడు పండితులు
- తన జీవితంలో భగవంతుడిని నమ్మని కరుణానిధి
- పరమ నాస్తికుడిగా పేరు
- ఏకాదశిన మరణించగా, ద్వాదశిన అంత్యక్రియలు
- స్వర్గానికే వెళ్లారంటున్న పండితులు
తన జీవితంలో భగవంతుడిని నమ్మని పరమ నాస్తికుడిగా పేరు తెచ్చుకున్న కరుణానిధి స్వర్గానికి వెళ్లారని తమిళనాడు పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏకాదశినాడు సూర్యాస్తమయం వేళ మరణించడం, ద్వాదశి ఘడియల్లో అంత్యక్రియలు జరగడంతో ఆయనకు స్వర్గ ప్రాప్తి లభించిందని, ఇటువంటి భాగ్యం అందరికీ లభించదని అంటున్నారు. నాస్తికుడైన కరుణ అరుదైన అదృష్టానికి నోచుకున్నారని చెబుతున్నారు. ఆయనకు మోక్షప్రాప్తి కలగాలని చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం రాజగోపురంపై పూజారులు మోక్ష దీపాలను కూడా వెలిగించారు.
ఇదిలావుండగా, కరుణానిధి అంత్యక్రియలను, అంతిమయాత్ర దృశ్యాలను చూస్తూ, భావోద్వేగానికి గురై రాష్ట్రవ్యాప్తంగా 43 మంది మరణించారని డీఎంకే వర్గాలు వెల్లడించాయి. మరోపక్క, ఆయనపై దాఖలైన 13 పరువునష్టం కేసులను కొట్టివేస్తున్నట్టు చెన్నై ప్రిన్సిపల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక మెరీనా బీచ్ లో కరుణ అంత్యక్రియలు జరిగిన ప్రాంతాన్ని ప్రజలు పెద్దఎత్తున సందర్శిస్తున్నారు. ఆయన సమాధి వద్ద పెద్ద సైజు చిత్రపటాన్ని డీఎంకే శ్రేణులు సమాధిపై ఉదయిస్తున్న సూర్యడి ఆకారాన్ని గులాబీలు, బంతిపూలతో అలంకరించారు.