Hyderabad: హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం.. స్తంభించిన ట్రాఫిక్!
- జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం
- పలు మార్గాల్లో రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీరు
- బంజారాహిల్స్ లో నిలిచిపోయిన వాహనాలు
హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట, పంజాగుట్ట, నాంపల్లి, లక్డీకాపూల్, అబిడ్స్,కోఠి, బషీర్ బాగ్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, మోతీనగర్, రాజీవ్ నగర్, గచ్చిబౌలి, మణికొండ, లంగర్ హౌజ్, రాజేంద్రనగర్, మెహిదీపట్నం, రెజిమెంటల్ బజార్, మారేడుపల్లి, అడ్డగుట్ట, చిలకలగూడ, పద్మారావునగర్, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు మార్గాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. బంజారాహిల్స్ లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. లక్డీకాపూల్ నుంచి ఎన్ఎండీసీ వరకు ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
కాగా, ఈరోజు మధ్యాహ్నం కూడా చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. పఠాన్ చెరువు, శేరిలింగంపల్లి, మియాపూర్, బోయినపల్లి, చందానగర్, ఉప్పల్, చార్మినార్ తో పాటు పలు శివారు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీగా వరదనీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో, జీహెచ్ఎంసీ మాన్ సూన్ టీమ్స్ ను రంగంలోకి దింపింది.