cs dinesh kumar: ఏపీలో రైల్వే ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి: సీఎస్ దినేష్ కుమార్

- రాష్ట్రంలో మంజూరైన వివిధ రైల్వే ప్రాజెక్టులపై సమీక్ష
- భూ సేకరణ సమస్యలుంటే పరిష్కరించుకోవాలి
- పనులు వేగవంతంగా జరిగేలా చూడాలి
- రైల్వే తరపున ఒక నోడల్ అధికారిని నియమించాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంజూరైన వివిధ రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ రైల్వే అధికారులను కోరారు. రాష్ట్రంలో మంజూరైన వివిధ రైల్వే ప్రాజెక్టులపై ఆయన సమీక్షించారు. ఏపీ సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ఈ రోజు ఆయన సమీక్షించారు.
ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో మంజూరైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు నిధుల అవశ్యకత, భూసేకరణ, తిరుపతి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి, రాయల చెరువు వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మాణం, నడికుడి - శ్రీకాళహస్తి సెక్షన్ నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులో భూసేకరణ అంశాలు, రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు (ఆర్ఓబి), రైలు అండర్ బ్రిడ్జి (ఆర్ యుబి) లకు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మంజూరైన వివిధ రైల్వే ప్రాజెక్టులను, అదే విధంగా రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన చేపట్టి పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ విషయంలో సమస్యలుంటే వాటిని సకాలంలో పరిష్కరించుకునేందుకు సీసీఎల్ఏ తోను, సంబంధిత జిల్లా కలెక్టర్లతోను నిరంతరం సమన్వయం కలిగి ఉండాలని చెప్పారు. అంతేగాక, సంబంధిత శాఖాధికారుల సమన్వయంతో ఇలాంటి సమస్యలను సకాలంలో పరిష్కరించుకుని పనులు వేగవంతంగా జరిగేలా చూసేందుకు రైల్వే తరపున ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు.

కాగా, రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టుల ప్రగతిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ వివరించారు. రైల్వే సేప్టీకి సంబంధించి చేపట్టిన వివిధ పనుల్లో రైల్వే తరపును చేయాల్సిన పనులు చాలా వరకూ పూర్తి చేశామని వాటికి అప్రోచ్ రోడ్ల నిర్మాణం, ఇతర పనులను రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కావలి - పెదపావని రహదారిపై రూ.43 కోట్లతో చేపట్టిన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పూర్తి చేశామని చెప్పారు.
అలాగే, విశాఖ జిల్లా యలమంచిలి వద్ద 5వ నంబరు జాతీయ రహదారిపై రూ.35 కోట్లతో, తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు వద్ద రూ.28 కోట్లతో, కాకినాడ నగరంలో రూ.65 కోట్లతో, గూడూరు పట్టణంలో రూ.63 కోట్లతో, నంద్యాల వద్ద రూ. 39 కోట్లతో చేపట్టిన ఆర్ఓబీ పనులు పూర్తి చేశామని, వాటికి అప్రోచ్ రోడ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. అదేవిధంగా నడికుడి - శ్రీకాళహస్తి, గుంటూరు - తెనాలి డబుల్ లైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, గుంటూరు - గుంతకల్ డబుల్ లైన్ నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయని, విజయవాడ - గుడివాడ - భీమవరం ఎలక్ట్రిఫికేషన్ తో కూడిన డబుల్ లైన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివేక్ యాదవ్ వివరించారు.
