Chandrababu: ఏపీని చంద్రబాబు, జగన్ గుప్పిట్లో పెట్టుకున్నారు: పవన్ కల్యాణ్
- భీమవరంలో బీసీ సంఘాలతో పవన్ కల్యాణ్ భేటీ
- సమాజాన్ని విభజించి పాలిస్తున్నారు
- టీడీపీలో ఉన్న కాపు నాయకులు ఏం చేస్తున్నారు?
ఏపీని చంద్రబాబు, జగన్ గుప్పిట్లో పెట్టుకున్నారని, సమాజాన్ని విభజించి పాలిస్తున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ తన పర్యటనను ఈరోజు నుంచి తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో భీమవరంలో బీసీ సంఘాలతో ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం మనుషులుగా ఉన్నా కులాలుగా విడిపోయామని, కాపు రిజర్వేషన్లు పెట్టి బీసీలకు అన్యాయం జరుగుతుందంటున్నారని విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై బీసీ కులాలకు లాభనష్టాలు వివరించాలని అన్నారు. కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడాల్సి వస్తే టీడీపీలో ఉన్న కాపు నాయకులు ఏం చేస్తున్నారు? అలాగే, ప్రతి బీసీ కులంలో ఉన్న నాయకులు వాళ్ళ వాళ్ల కులాల కోసం ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. రాజకీయనాయకులను గుడ్డిగా నమ్మేసి ప్రతిసారి మోస పోకూడదని, మనల్ని మనం ప్రశ్నించుకోవాలని పవన్ సూచించారు.
‘జనసేన’ ప్రశ్నించే పార్టీ అని నేనెప్పుడూ చెప్పలేదు. ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి పార్టీ బాధ్యత. కానీ, చాలామంది ఏం చేశారంటే.. ‘జనసేన’ను ప్రశ్నించే పార్టీగా పరిమితం చేస్తే అధికారం ఇంకొకరికి ఇవ్వొచ్చనే ఆలోచనను బలంగా తీసుకెళ్లారు. ఒక తప్పు లేదా అన్యాయం జరుగుతున్నప్పుడు ముందుగా ప్రశ్నిస్తాం... ‘జనసేన’ ప్రశ్నించే పార్టీ అని చెబుతూ పార్టీ పరిమితిని తగ్గించారు’ అని పవన్ అన్నారు.