british airways: బ్రిటిష్ ఎయిర్ వేస్ లో భారతీయులపై జాతి వివక్ష.. దురుసుగా ప్రవర్తించిన సిబ్బంది!

  • బలవంతంగా విమానం నుంచి దించివేత
  • కేంద్ర మంత్రి ప్రభుకు ఫిర్యాదు చేసిన భారతీయులు
  • విచారణకు ఆదేశించిన బ్రిటిష్ ఎయిర్ వేస్

బ్రిటన్ లో భారతీయులకు చేదు అనుభవం ఎదురైంది. విమానంలో ఓ బాబు ఏడుస్తుండటంతో అక్కడికి చేరుకున్న క్రూ సిబ్బంది ఒకరు జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంతో పాటు విమానంలోని భారతీయుల్ని దించేసి అవమానించారు. జూలై 23న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భారత్ కు చెందిన 1984 బ్యాచ్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అధికారి తన భార్య, మూడేళ్ల కుమారుడితో కలసి బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన లండన్-బెర్లిన్ విమానం(బీఏ 8495) ఎక్కారు. అయితే విమానం టేకాఫ్ సమయంలో చిన్నారి బెదిరి ఏడవడం ప్రారంభించాడు. దీంతో తల్లి అతడ్ని ఒళ్లోకి తీసుకుంది. ఇంతలో అక్కడకు చేరుకున్న క్రూ సిబ్బంది ఒకరు.. ఈ దంపతులపై గట్టిగా అరవడం ప్రారంభించాడు. చిన్నారిని తన సీట్లోకి వెళ్లాలని గద్దించాడు. దీంతో పసిపిల్లాడు మరింత బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు.

ఇంతలో వీరి పక్కనే ఉన్న మరికొందరు భారతీయులు పిల్లాడికి బిస్కెట్లు ఇచ్చి సముదాయించారు. అనంతరం పిల్లాడిని పక్కన సీట్లో కూర్చోబెట్టారు. ఇంతలోనే మరోసారి అక్కడికి వచ్చిన సదరు వ్యక్తి.. ‘యూ బ్లడీ.. నోరు మూసుకో.. లేదంటే కిటీకీ నుంచి బయటకు విసిరేస్తా’ అంటూ బాబును దూషించాడు. అనంతరం కొద్దిసేపటికే విమానంలోకి వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది, ఈ ముగ్గురితో పాటు వెనక సీట్లో ఉన్న భారతీయుల్ని బలవంతంగా దించేశారు.

దీంతో సదరు భారతీయ అధికారి ఈ ప్రవర్తనపై పౌర విమానయానశాఖ మంత్రి సురేశ్ ప్రభుకు ఫిర్యాదు చేశారు. ఈ జాతి వివక్ష ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు బ్రిటిష్ ఎయిర్ వేస్ యాజమాన్యం ప్రకటించింది.

  • Loading...

More Telugu News