Karunanidhi: ఆ ఇద్దరూ లేకున్నా నిజమిదే... కరుణానిధి పూర్వీకులది ఒంగోలే!
- 1960లో ఏలూరులో రచయితల సమావేశం
- హాజరైన కరుణానిధి, కొంపల్లి బాలకృష్ణ
- బాలకృష్ణకు తమ పూర్వీకుల వివరాలు చెప్పిన కరుణ
తమిళనాడు మాజీ సీఎం, దివంగత కరుణానిధి పూర్వీకులు తెలుగువారేనన్న సంగతి విదితమే. అయితే వారిది ఒంగోలు ప్రాంతమని తెలుస్తోంది. దాదాపు 60 ఏళ్ల క్రితం... అంటే, కరుణానిధి రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో... 1960ల ఆరంభంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు వచ్చిన కరుణానిధి, అక్కడ తనకు పరిచయమైన డిటెక్టివ్ నవలా రచయిత, ఒంగోలుకు చెందిన కొంపల్లి బాలకృష్ణకు తమ పూర్వీకుల వివరాలు చెప్పారు.
ఏలూరులో రచయితల సమావేశం జరుగగా, బాలకృష్ణ, కరుణ అక్కడ కలుసుకున్నారు. తనకు రెండు తరాల కిందటి వారు ఒంగోలు శివార్లలోని చెర్వుకొమ్ముపాలెంలో ఉండేవాళ్లని, వారు పెళ్లూరు సంస్థానం ఆస్థాన విద్వాంసులుగా పనిచేశారని చెప్పారు. ఒంగోలు ఎలా ఉందని, తమదీ ఒంగోలేనని, పరిస్థితులు అనుకూలించక, పూర్వీకులు మద్రాసుకు వలసవెళ్లి స్థిరపడ్డారని అన్నారు.
ఆపై కరుణ తన పూర్వీకుల గురించి మాట్లాడిన సందర్భాలు బహుఅరుదు. అయితే, బాలకృష్ణ మాత్రం తన సన్నిహితుల వద్ద, భార్య అరుణ వద్ద ఈ విషయాన్ని ఎన్నోమార్లు చెప్పారు. నాలుగేళ్ల క్రితం బాలకృష్ణ మరణించారు. కరుణానిధి కూడా ఇప్పుడు దివంగతులయ్యారు. తనలో ఉన్నది తెలుగుజాతి రక్తమేనని చెప్పేందుకు కరుణానిధి లేరు, ఆయన ఆ విషయాన్ని తనకు చెప్పారనినిర్ధారించేందుకు బాలకృష్ణ లేరు. ఆ ఇద్దరూ లేకున్నా అసలు నిజమిదే.