Tirumala: నేటి నుంచి తిరుమలలో సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ల జారీ బంద్!
- 11న మహాసంప్రోక్షణానికి అంకురార్పణ
- నేటి అర్ధరాత్రి నుంచి టోకెన్ల జారీ నిలిపివేత
- రేపు ఎల్లుండిలోగా టోకెన్ భక్తులకు దర్శనం
- ఆపై 9 రోజుల పాటు పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి
ఈనెల 11న తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం కార్యక్రమానికి అంకురార్పణ జరుగనుండటంతో, నేటి అర్ధరాత్రి నుంచి సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ల జారీని నిలిపివేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. కాలి నడకన వచ్చే భక్తులకు, టైమ్ స్లాట్ భక్తులకు టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేయనున్నామని, అప్పటివరకూ టికెట్లు పొందిన భక్తులకు రేపు రాత్రిలోగా దర్శనం చేయిస్తామని అధికారులు వెల్లడించారు.
11వ తేదీన దర్శనానికి 9 గంటల సమయం మాత్రమే అందుబాటులో ఉంటుందని, 50 వేల మందికి దర్శనం చేయించగలమని తెలిపిన అధికారులు, ఆ తరువాత పరిమిత సంఖ్యలో భక్తులను దేవాలయం లోపలికి పంపుతామని తెలిపారు. అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి రోజుకు 18 వేల నుంచి 35 వేల మందికి దర్శనం చేయిస్తామని పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే ఆలయం లోపల యజ్ఞగుండాలు, వేద పారాయణ వేదికల ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి.