Hyderabad: ఇకపై డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో సాయుధులైన పోలీసులు కూడా!
- పోలీసులతో వాగ్వాదం, మీడియాపై దాడులకు దిగుతున్న మందుబాబులు
- శుక్ర, శనివారాల్లో సాయుధ బలగాల సాయం
- వెల్లడించిన సైబరాబాద్ సీపీ సజ్జన్నార్
హైదరాబాద్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటం, వీరిలో కొందరు పోలీసులు, మీడియాపై దాడులకు పాల్పడుతూ ఉండటంతో,ట్రాఫిక్ పోలీసులకు తోడుగా ఆర్మ్ డ్ సిబ్బందిని రహదారులపై నిలపాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. డ్రంకెన్ డ్రైవ్ లో సాయుధ పోలీసు సిబ్బంది సేవలను శుక్ర, శనివారాల్లో వినియోగించుకుంటామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
మందుబాబులను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలన్నదే తమ ఉద్దేశమని చెప్పిన ఆయన, ఐటీ కారిడార్, నగర శివారు ప్రాంతాల్లో రిసార్ట్ లు, మద్యం దుకాణాలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయని అన్నారు. వీటిల్లో మద్యం తాగి రోడ్డెక్కుతున్న వాహనదారులు రోడ్డు ప్రమాదాలు చేస్తున్నారని తెలిపారు. ఈ సంవత్సరం జనవరి - జూన్ మధ్య 7,791 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి రూ. 84,36,550 జరిమానా వసూలు చేశామని, 1379 మందిని జైలుకు పంపించామని ఆయన తెలిపారు.