Telangana: ముషీరాబాద్ నియోజకవర్గంలో నీటి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలి: మంత్రి నాయిని
- చేపట్టాల్సిన పనులపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలి
- శ్మశాన వాటికల వద్ద బోర్ వెల్స్ వేయాలి
- అధికారులను ఆదేశించిన మంత్రి నాయిని
ముషీరాబాద్ నియోజకవర్గంలో నీటి సరఫరా కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డు (హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్.ఎస్.బి ) అధికారులను తెలంగాణ రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ, నియోజకవర్గంలో వాటర్ వర్క్స్ అవసరాలపై ప్రణాళిక సిద్ధం చేస్తే నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, ఈ మేరకు నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులు, అవసరమైన నిధుల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని, అదేవిధంగా శ్మశాన వాటికల వద్ద బోర్ వెల్స్ వేయడం ద్వారా నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.
అనంతరం, హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్.ఎస్.బి. ఎం.డి. దానకిశోర్, మాట్లాడుతూ, సాధ్యమైనంత తొందరలో ప్రణాళిక రూపొందిస్తామని, అత్యవసరమైన పనులను సిబ్బంది వెంటనే ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని కార్పొరేటర్లు పాల్గొన్నారు.