NTR: కరుణానిధి, ఎన్టీఆర్ ల స్నేహం ఒక చరిత్ర!
- ఎన్టీఆర్, కరుణానిధి మంచి స్నేహితులు
- సినీ రంగంలో చిగురించిన స్నేహం రాజకీయ రంగంలోనూ కొనసాగిన వైనం
- నేషనల్ ఫ్రంట్ ఏర్పాటుతో దేశం దృష్టిని ఆకర్షించిన దిగ్గజాలు
- ఎన్నికల్లో కరుణానిధి కోసం తమిళనాట ప్రచారం చేసిన ఎన్టీఆర్
వారిద్దరూ ఎవరికి వారే హేమాహేమీలు ... రాజకీయ దిగ్గజాలు.... తెలుగునాట ఒకరు, తమిళనాట మరొకరు తమదైన నాయకత్వ లక్షణాలతో ధీరోదాత్తులుగా నిలిచారు. సినీ రచనలో ఒకరు.. సినీ హీరోగా మరొకరు తమ సత్తా చాటినవారు.. వారే కరుణానిధి, ఎన్టీఆర్ లు! ఇద్దరిలోనూ మాతృభాషపై మమకారం వుంది. స్వేచ్చాయుతంగా రాష్ట్రాల్లో పాలన వుండాలని, రాష్ట్రాలకు తగిన అధికారాలు వుండాలని కాంక్షించిన ఇరువురు నాయకుల మైత్రి ఎనలేనిది. ఒకరికి ఒకరు సహకరించుకున్న తీరు, నాటి కాంగ్రెస్ పాలనపై వారు సలిపిన పోరు గణనీయమైనది.
కరుణానిధి, ఎన్టీఆర్ ల మైత్రీ బంధం కడదాకా కొనసాగింది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కరుణానిధికి విడదీయరాని బంధం వుంది. తెలుగు రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలపై ఆయన దృష్టి ఎప్పుడూ వుంటూనే వుండేది. సినీరచయితగా కరుణానిధి , సినీహీరోగా ఎన్టీఆర్ ఉన్న రోజులనుండి వారి మధ్య స్నేహం వుండేది. ఆ బంధం రాజకీయాల్లో కూడా కొనసాగింది.
నాడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏక ఛత్రాధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో కాంగ్రెసేతర పక్షాలను ఏక తాటిపైకితెచ్చి కాంగ్రెస్ పార్టీపై సమరశంఖం పూరించిన ఉద్దండులు కరుణానిధి, ఎన్టీఆర్ లు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి అందులో భాగస్వామ్య పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావటానికి చెన్నైలో జరిపిన బహిరంగ సభలో కరుణానిధి , ఎన్టీఆర్ లు కీలక భూమిక పోషించారు. మెరీనా బీచ్ వేదికగా ఇరువురు ఆవేశభరితమైన ప్రసంగాలు చేశారు. ఆ సభలో ఎన్టీఆర్ ను నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా ఎన్నుకున్నారు. నాటి రాజకీయాల్లో దేశం మొత్తం దృష్టిని ఆకర్షించేలా చాలా చురుకైన పాత్ర పోషించారు ఇరువురు . తరువాత పశ్చిమబెంగాల్ లో జరిగిన రెండవ ఫ్రంట్ సభకు ఇరువురు కలిసి హాజరయ్యారు.
ఒక పక్క దేశ రాజకీయాలలో మార్పుకు ప్రయత్నిస్తూనే, మరోపక్క రాష్ట్ర రాజకీయాల్లో ఒకరికొకరు సహరించుకున్నారు. 1989 జనవరిలో తమిళనాడులో ఎన్నికలు జరిగినప్పుడు కరుణానిధి కోసం ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ స్నేహితుడి కోసం కొన్నిరోజులపాటు తమిళనాడులోనే వుండి విస్తృతప్రచారం చేశారు. తిరునల్వేలి, కోయంబత్తూర్ , చెన్నై తదితర ప్రదేశాలలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో కరుణానిధి పార్టీ విజయం సాధించింది. ఎన్టీఆర్ చివరివరకు కరుణానిధితో సత్సంబంధాలు కొనసాగాయి. స్నేహపూర్వక అనుబంధం వీరిరువురు నాయకుల మధ్య ఉంది. అదే చివరి వరకు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కరుణానిధి ఆసక్తికి కారణం అయ్యింది. నాడు ఎన్టీఆర్, నేడు కరుణానిధి ఈ లోకాన్ని వీడి పోయినా వీరి స్నేహం రెండు రాష్ట్రాల రాజకీయాల్లో, నాటి వారి పాలనలో చెరగని ముద్ర వేసింది.