karunanidhi: స్టాలిన్ కు భావోద్వేగపూరిత లేఖను రాసిన సోనియాగాంధీ
- కరుణానిధి నాక్కూడా తండ్రిలాంటివారే
- రాజకీయరంగంలో ఓ శిఖరం ఆయన
- ఆయన ఆశయాలను మీరు ముందుకు తీసుకెళతారని నమ్ముతున్నా
కరుణానిధి మరణం పట్ల యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కరుణ కుమారుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కు ఆమె ఓ భావోద్వేగపూరిత లేఖను రాశారు.
'స్టాలిన్ గారు.. కరుణానిధి మరణం నన్నెంతో బాధించింది. కలైంగర్ లాంటి మరో వ్యక్తిని మనం ఎప్పటికీ చూడలేము. ఒక మహానేతను దేశం కోల్పోయింది. రాజకీయరంగంలో కరుణానిధి ఒక శిఖరంలాంటివారు. తమిళనాడుకే కాక దేశానికి కూడా ఆయన ఎంతో సేవ చేశారు. సమాజంలో సమానత్వం కోసం, అభివృద్ధి కోసం, తమిళనాడు ఉన్నతి కోసం, పేదల కోసం ఆయన ఎంతో కృషి చేశారు.
తమిళనాడు కళలు, సంస్కృతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చారు. దశాబ్దాలపాటు ఆయన చేసిన సేవలు చిరకాలం నిలిచిపోతాయి. మీ తండ్రి ఆశయాలను మీరు ముందుకు తీసుకెళ్తారని నేను బలంగా నమ్ముతున్నా. కరుణానిధి మరణం వ్యక్తిగతంగా నాకు చాలా బాధాకరం. నా పట్ల ఆయన ఎంతో అభిమానాన్ని చూపించారు. నాక్కూడా ఆయన ఒక తండ్రిలాంటి వారే. నా మనస్సు, ప్రార్థనలు అన్నీ మీ కుటుంబంతోనే ఉన్నాయి' అంటూ లేఖలో పేర్కొన్నారు.