Tamilnadu: ‘తమిళనాడు ప్రజల ఆరాధ్యదైవం, హీరో కరుణానిధి’ అంటూ కొనియాడిన విదేశీ మీడియా
- కరుణానిధి గురించి కథనాలు రాసిన విదేశీ మీడియా
- బీబీసీ, వాషింగ్టన్ పోస్ట్.. లలో కథనాలు
- కరుణ స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు: సేలన్ టుడే
డీఎంకే అధినేత కరుణానిధి నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. కరుణానిధి మృతి అనంతరం, ఆయన జీవిత విశేషాలు, సినీ రంగ ప్రవేశం, రాజకీయ ప్రస్థానం మొదలైన విషయాల గురించి మన దేశంలోని మీడియా.. ముఖ్యంగా తమిళనాడు మీడియా అందుకు సంబంధించిన కథనాలను ప్రసారం చేసింది. ఈ సందర్భంగా విదేశీ మీడియా కూడా కరుణానిధి గురించి ప్రముఖంగా ప్రస్తావించింది. ముఖ్యంగా, బీబీసీ, వాషింగ్టన్ పోస్ట్, సీఎన్ఎన్, శ్రీలంకకు చెందిన సేలన్ టుడే లలో కరుణ గురించి పేర్కొన్నారు.
తమిళనాడు ప్రజల హీరోగా కొనసాగిన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇకలేరని సేలన్ టుడే పేర్కొంది. తమిళనాడులో ఇక ఆయన శకం ముగిసినట్లేనని, ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని తెలిపింది. తమిళనాడు ప్రజల ఆరాధ్య దైవం, రాజకీయ బ్రహ్మ కరుణానిధి కన్నుమూశారని, తన తుదిశ్వాస విడిచే వరకూ డీఎంకే అధినేతగా కొనసాగారని, అప్పట్లో కులవిద్వేషాలకు వ్యతిరేకంగా కరుణానిధి పోరాడిన విషయాన్ని పేర్కొంది.
రాజకీయ, సినీ రంగాల్లో కరుణానిధి చెరగని ముద్ర వేసుకున్నారని, ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో సేవలు చేశారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. డీఎంకే అధినేతగా ఎన్నో సంవత్సరాలు కొనసాగారని, సుమారు 19 సంవత్సరాలపాటు పలుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని పేర్కొంది. పద్నాలుగేళ్ల వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన కరుణానిధి అంచెలంచెలుగా ఎదిగారని, తమిళనాడు ప్రజల కోసం ఎన్నో సేవలు చేశారని సీఎన్ఎస్ పేర్కొంది.