REHAM KHAN: ఇమ్రాన్ మాజీ భార్యకు వేధింపులు.. హుందాగా స్పందించిన రేహమ్!
- బ్రిటన్ లో రేహమ్ ను వేధించిన మరో మహిళ
- ప్రశాంతంగా జవాబిచ్చిన జర్నలిస్ట్
- రేహమ్ కు నెటిజన్ల మద్దతు
పాకిస్తాన్ కు కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య, జర్నలిస్ట్ రేహమ్ ఖాన్ కు బ్రిటన్ లో వేధింపులు ఎదురయ్యాయి. ఓ పార్కులో రేహమ్ దగ్గరకు వెళ్లిన ఓ మహిళ కోపంగా మాట్లాడుతూ, ఇమ్రాన్ ప్రస్తుత భార్య బుష్రా మనేకాపై అసూయతోనే మీరు ఈ విమర్శలు చేస్తున్నారంటూ ఆరోపించింది. అయితే, రేహమ్ ఏమాత్రం ఆవేశపడకుండా, హుందాగా జవాబిచ్చేందుకు యత్నించింది. అయినా సదరు మహిళ అలాగే వాదిస్తూ ఉండటంతో రేహమ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
ఇమ్రాన్ ను 2015లో పెళ్లి చేసుకున్న రేహమ్.. 9 నెలలకే అభిప్రాయభేదాలతో విడిపోయింది. అనంతరం ఇమ్రాన్ వ్యక్తిగత అలవాట్లపై ఆమె రాసిన పుస్తకం సంచలనం రేపింది. దీంతో ఇమ్రాన్ అభిమానులు రేహమ్ ను లక్ష్యంగా చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగింది.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్బంగా పలువురు నెటిజన్లు రేహమ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ గురించి రేహమ్ చెప్పిన మాటలు నమ్మకపోయినా ఆమెను ఈ రకంగా వేధించడం సరికాదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.