Madras: ప్రొటోకాలా?... మనోభావాలా?... మద్రాస్ హైకోర్టులో తీవ్ర గందరగోళం.. ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం!
- జానకీ రామచంద్రన్ కు భర్త పక్క స్థలం ఇవ్వలేదు
- పెరియార్ కు కూడా ఆ చాన్స్ దక్కలేదు
- కామరాజ్ నాడార్, భక్తవత్సలం, రాజాజీలను గుర్తు చేసిన ప్రభుత్వ న్యాయవాదులు
గతంలో జానకీ రామచంద్రన్ మరణించిన వేళ, అధికారంలో ఉన్నవారు, భర్త స్మారకం పక్కనే ఆమె అంత్యక్రియలకు అనుమతి ఇవ్వలేదని, ఆ సమయంలో సీఎం పదవిలో ఉండి చనిపోతేనే మెరీనా బీచ్ లో స్థలాన్ని చూపుతామని ఆ పార్టీ స్పష్టం చేసిందని తమిళనాడు ప్రభుత్వ న్యాయవాదులు హైకోర్టులో తమ వాదన వినిపించారు. కామరాజ్ నాడార్, భక్తవత్సలం, రాజాజీ తదితరుల అంత్యక్రియలు గాంధీ మండపంలోనే జరిగాయని గుర్తు చేశారు. ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ కు కూడా మెరీనా బీచ్ లో స్థలం కేటాయించలేదని చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారమే గతంలో నేతల అంత్యక్రియలు జరిగాయని, ఇప్పుడు రాజకీయ కారణాలతో డీఎంకే కేసు వేసిందని ఆరోపించారు. రాత్రికి రాత్రి పిటిషన్ దారులను మేనేజ్ చేశారని అన్నారు.
దీనిపై డీఎంకే న్యాయవాది తీవ్ర అభ్యంతరం చెబుతూ, 'సిట్టింగ్ సీఎం'ల నిబంధన ఎక్కడా లేదని చెప్పారు. ప్రజల మనోభావాలను దెబ్బతినకుండా చూడాలని, ఐదుసార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తికి సరైన గౌరవం ఇవ్వాలని అన్నారు. ఈ దశలో కోర్టు హాలులో వాదప్రతివాదనలు, అరుపులతో గందరగోళం నెలకొనగా, ప్రధాన న్యాయమూర్తి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.