Madras highcourt: మెరీనా బీచ్‌లో స్థలం ఇవ్వకుంటే కోటి మంది బాధ పడతారు: డీఎంకే లాయర్.. కొనసాగుతున్న వాదోపవాదాలు
- తమిళనాడు వ్యాప్తంగా కరుణకు కోటిమంది అభిమానులు
- సంతాప దినాలు ప్రకటించినప్పుడు స్థలం ఇవ్వడానికి ఇబ్బంది ఎందుకు?
- పెరియార్‌కే ఇవ్వలేదు: ప్రభుత్వ లాయర్
కరుణానిధి అంత్యక్రియలకు స్థలం విషయంలో ప్రభుత్వానికి-డీఎంకేకు మధ్య మొదలైన వివాదం తెగడం లేదు. న్యాయపరమైన చిక్కులు చూపి మెరీనా బీచ్‌లో స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. దీనికి నొచ్చుకున్న డీఎంకే నేతలు తమకు అక్కడే కావాలంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం దీనిపై వాదనలు జరుగుతున్నాయి. డీఎంకే న్యాయవాది మాట్లాడుతూ తమిళనాడు మొత్తం జనాభా ఏడుకోట్లని, అందులో కోటిమంది డీఎంకే అభిమానులని పేర్కొన్నారు. తమ అభిమాన నేత అంత్యక్రియలకు మెరీనా బీచ్‌లో స్థలం ఇవ్వకుంటే వారంతా తీవ్ర మనస్తాపానికి గురవుతారని పేర్కొన్నారు.
కరుణానిధి మృతికి అధికారికంగా సంతాప దినాలు ప్రకటించినప్పుడు స్థలం ఇవ్వడానికి ఇబ్బందేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం మెరీనా బీచ్‌లో మాజీ ముఖ్యమంత్రులకు మెరీనా బీచ్‌లో స్థలం ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ.. స్థలం విషయంలో డీఎంకే కోర్టు కెక్కడంలో రాజకీయ ఎజెండా ఉందని వాదించారు. ద్రవిడ ఉద్యమంలో గొప్ప నేత అయిన డీకే చీఫ్ పెరియార్‌కే మెరీనా బీచ్‌లో స్థలం ఇవ్వలేదని గుర్తు చేశారు.