Chennai: గోపాలపురం ఇంటిని రూ.45 వేలకే కొన్న కరుణ.. ఆసుపత్రిగా మారనున్న వైనం!
- మంత్రి కావడానికి ముందే ఇల్లు కొనుగోలు
- తల్లి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు
- తదనంతరం ఇంటిని ఆసుపత్రిగా మార్చాలంటూ దానంగా రాసిచ్చిన కరుణ
కరుణానిధి అనారోగ్యంతో బాధపడుతున్నారన్న వార్త బయటకు వచ్చిన తర్వాత గోపాలపురం గురించి తరచూ వార్తలు వచ్చాయి. ఆయన నివసించేది ఇక్కడే కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఇంటికి గొప్ప చరిత్ర ఉంది. దేశ రాజకీయాల్లో కీలకమైన పలు నిర్ణయాలు ఇక్కడి నుంచే వెలువడ్డాయి. ఎందరో నేతలు ఈ ఇంటికి వచ్చిన వారే. అంతేకాదు, ఇళ్ల మధ్యన ఉన్న సీఎం నివాసం దేశంలో బహుశా ఇదొక్కటే కావడం విశేషం.
తాను మంత్రి కావడానికి ముందే కరుణానిధి ఈ ఇంటిని కొనుగోలు చేశారు. 1955లో శరబేశ్వర అయ్యర్ అనే వ్యక్తి నుంచి రూ.45 వేలకు ఈ ఇంటిని కొనుగోలు చేసినట్టు కరుణ ఓ సందర్భంలో తెలిపారు. కరుణ ముఖ్యమంత్రి అయ్యాక కూాడా ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఇంటిని కుమారుల పేరిట రాసిచ్చినప్పటికీ, దానిని తన తదనంతరం ఆసుపత్రిగా మార్చాలని కరుణ కోరారు. దీంతో కుమారులు అళగిరి, స్టాలిన్, తమిళరసులు తిరిగి ఆ ఇంటిని 2009లో తండ్రికే అప్పగించారు. తన 87వ జన్మదినం సందర్భంగా కరుణానిధి ఆ ఇంటిని దానంగా రాసిచ్చారు. తమ తదనంతరం ఇంటిని తల్లి ‘అన్నై అంజుగం ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఆసుపత్రిగా మార్చడానికి ఏర్పాటు చేశారు.