GVL: అసలు నువ్వెవరయ్యా.. నీకేం తెలుసని మాట్లాడుతున్నావ్?: పీయూష్ గోయల్‌తో సమావేశంలో జీవీఎల్‌పై విరుచుకుపడిన టీడీపీ ఎంపీలు
- టీడీపీ నేతల ప్రశ్నలకు జీవీఎల్ సమాధానం
- నువ్వెందుకు మాట్లాడుతున్నావంటూ విరుచుకుపడిన నేతలు
- మాట్లాడి తీరతానన్న జీవీఎల్
- ఉద్రిక్తంగా మారిన సమావేశం
రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్‌తో టీడీపీ నేతల సమావేశం ఉద్రిక్తంగా మారింది. కేంద్రమంత్రి స్పందించాల్సిన విషయాలపైనా జీవీఎల్ స్పందించడంపై టీడీపీ ఎంపీలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆంధ్రప్రదేశ్ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారంటూ అందరూ కలిసి విరుచుకుపడ్డారు. మంత్రిని అడుగుతుంటే సమాధానం చెప్పడానికి మీరెవరంటూ ఆయనపై ఫైరయ్యారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సమావేశం కాస్తా రసాభాసగా మారింది.
మంగళవారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతృత్వంలో ఢిల్లీలోని రైల్ భవన్‌లో పీయూష్ గోయల్‌తో నేతలు సమావేశమయ్యారు. ఎంపీలు, ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 25 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బీజేపీ నుంచి ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, హరిబాబు పాల్గొన్నారు. టీడీపీ ఎంపీల తరపున అశోక్‌గజపతి రాజు, మంత్రుల తరపున సుజయకృష్ణ రంగారావు, స్థానిక ఎంపీ హోదాలో అవంతి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ సందర్భంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ను ప్రకటించాలని మంత్రికి వినతి పత్రం అందించారు.
ఈ సందర్బంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాలకు కేంద్రం రూ.350 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుందని పేర్కొన్నారు. దీంతో కలగజేసుకున్న జీవీఎల్.. టీడీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. దీంతో టీడీపీ నేతలు ఒక్కసారిగా సీట్లలోంచి లేచి ఆయనపై విరుచుకుపడ్డారు. ఏపీ గురించి మాట్లాడడానికి మీరెవరని నిలదీశారు. రాష్ట్రం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారని, మంత్రిని అడుగుతుంటే మీరెందుకు స్పందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జీవీఎల్ కూడా వారిపై ఎదురుదాడికి దిగారు.
సుజనా చౌదరి మాట్లాడుతూ.. తాము కేంద్రమంత్రికి వినతిపత్రం ఇచ్చి సమస్యలు విన్నవించడానికి వచ్చామని, ఆయనే తమకు వివరణ ఇస్తారని, మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. అసలు ఏ హోదాతో మాట్లాడుతున్నారని, మీకే హక్కు ఉందని మండిపడ్డారు. కళా వెంకట్రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేయాలని చూస్తే రాష్ట్రంలో తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు.
దీంతో జీవీఎల్ మరింత రెచ్చిపోయారు. ‘నువ్వేం చేస్తావ్?’ అని కళాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాట్లాడి తీరుతానని చెప్పడంతో టీడీపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో మాటామాటా పెరిగి సమావేశంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పీయూష్ గోయల్, హరిబాబు, సుజనా చౌదరి కల్పించుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.