Andhra Pradesh: ఎన్టీఆర్ గృహనిర్మాణంపై లబ్ధిదారులు సంతృప్తిగా ఉన్నారు: ఏపీ మంత్రి కాలవ శ్రీనివాసులు
- ఎన్టీఆర్ గృహనిర్మాణంపై 82 శాతం సంతృప్తి
- బిల్లుల చెల్లింపు వేగవంతం చేయండి
- గృహ నిర్మాణ అధికారులతో సమీక్షించిన కాలవ
ఏపీలోని ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకంపై లబ్ధిదారుల్లో 82 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రంలోని గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్లతో తాడేపల్లిలోని సంస్థ కార్యాలయంలో ఈరోజు ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ, రియల్‌టైమ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ఫోన్ ద్వారా నిర్వహించిన సర్వేలో ఈ మేరకు అభిప్రాయం వ్యక్తమైందని, గృహనిర్మాణ సంస్థ ద్వారా అమలు చేస్తున్న అన్ని పథకాలపై లబ్ధిదారుల్లో సగటున 54 శాతం సంతృప్తి వ్యక్తమవుతోందని చెప్పారు. గృహ నిర్మాణ సిబ్బంది అవినీతికి పాల్పడటం లేదని 92 శాతం మంది లబ్ధిదారులు తెలిపారని, ఇది సంతోషకరమని అన్నారు.
అసంతృప్తి వ్యక్తమైన గ్రామాలకు వెళ్లి అందుకు గల కారణాలను తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు లబ్ధిదారులకు చెల్లింపులు కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు.
గృహనిర్మాణంపై గతంలో వున్న దురభిప్రాయం ప్రజల్లో తొలగిపోయిందని, గ్రామీణ గృహనిర్మాణం బాగా జరుగుతోందన్న అభిప్రాయం సర్వత్ర వ్యక్తమవుతోందని అన్నారు. ఈ పేరు నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు గృహనిర్మాణ అధికారులు పోటీపడి పని చేయాలని పిలుపు నిచ్చారు. లబ్ధిదారులకు సకాలంలో చెల్లింపులు చేయడం ద్వారా వారిలో సంతృప్తి స్థాయిని పెంచవచ్చని, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పీఎంఏవై ఇళ్లకు సంబంధించి మ్యాపింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని తద్వారా కేంద్రం నుండి తొలివిడత నిధులు విడుదలయ్యేందుకు అవకాశం వుంటుందని చెప్పారు.
గృహనిర్మాణ సంస్థ ద్వారా మంజూరైన ఇళ్లు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసేందుకు అన్నిజిల్లాల్లోనూ తగిన వ్యూహాలను రూపొందించుకొని వాటిని అమలు చేయడం ద్వారా లక్ష్యాలను సాధించాలని సూచించారు. వచ్చే సంవత్సరానికి సంబంధించి మరో 4 లక్షల ఇళ్లు త్వరలో మంజూరు కానున్నందున గృహనిర్మాణ సిబ్బంది మరింత వేగవంతంగా పనిచేయాలని అన్నారు.