Sucide: వంట బాగా చేయాలని భార్యను కోరడం తప్పేమీ కాదు: బాంబే హైకోర్టు కీలక రూలింగ్
- 17 ఏళ్ల నాటి మహిళ ఆత్మహత్య కేసులో కోర్టు తీర్పు
- నిందితులది తప్పున్నట్టు కనిపించడం లేదన్న న్యాయస్థానం
- ఇంటి పని చేయాలనడాన్ని వేధింపులుగా భావించలేమన్న న్యాయమూర్తి
తన భార్యను రుచిగా వంట చేయాలని, ఇంటి పనులు చేసుకోవాలని కోరడం తప్పేమీ కాదని, అది ఆమెను హింసించినట్టుగా భావించేందుకు సరైన కారణం కాదని బాంబే హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. 17 సంవత్సరాల నాటి ఓ మహిళ ఆత్మహత్య కేసులో భర్త విజయ్ షిండే, ఆయన తల్లిదండ్రులకు కింది కోర్టు విధించిన శిక్షను నిలిపివేస్తూ, ఈ వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో తనను హింసిస్తున్నారని, భర్తకు వివాహేతర బంధం ఉందని ఆరోపిస్తూ, ఓ మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకోగా, కేసు విచారణ హైకోర్టుకు చేరింది.
"వంట సరిగ్గా చేయమని కోరడం, సక్రమంగా ఇంటి పని చేసుకోవాలని చెప్పడం వంటివి తప్పు కాదు. అదేమీ వేధింపులుగా భావించలేము. ఈ కేసులో అంతకు మించిన సాక్ష్యాలు నిందితులపై లేవు. ఐపీసీలోని సూసైడ్ సెక్షన్ల ప్రకారం కూడా వీరిని దోషులుగా పేర్కొనలేము" అని వ్యాఖ్యానించిన జస్టిస్ సరంగ్ కొత్వాల్, నిందితుడిపై వచ్చిన వివాహేతర బంధంపైనా ఆధారాలను ప్రాసిక్యూషన్ చూపించలేదని అభిప్రాయపడ్డారు.