RK Dhawan: ఇందిరా గాంధీకి నమ్మినబంటు, కాంగ్రెస్ నేత ఆర్కే ధావన్ కన్నుమూత

  • నిన్న రాత్రి 7 గంటల సమయంలో మృతి
  • క్యాన్సర్, రక్తంలో ఇన్ ఫెక్షన్ కారణంగానే
  • వెల్లడించిన ఆసుపత్రి వర్గాలు
  • సంతాపం తెలిపిన ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ నేతలు

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీకి అత్యంత విశ్వసనీయుడిగా పేరు తెచ్చుకున్న రాజీందర్ కుమార్ ధావన్ (ఆర్కే ధావన్) ఢిల్లీలోని బీఎల్ కపూర్ ఆసుపత్రిలో నిన్న రాత్రి 7 గంటల సమయంలో మరణించారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. వృద్ధాప్య కారణాలకు తోడు క్యాన్సర్, రక్తంలో ఇన్ ఫెక్షన్, మూత్రపిండాలు దెబ్బతినడం తదితర కారణాలతో ధావన్ మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన మృతికి సంతాపం తెలిపిన కాంగ్రెస్ పార్టీ, ధావన్ చూపిన స్ఫూర్తి, నిబద్ధతను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని వ్యాఖ్యానించింది.

కాగా, 1962 నుంచి 84 మధ్య కాలంలో ధావన్ ఇందిరకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. 1975లో ఎమర్జెన్సీ విధించిన వేళ, ధావన్ కు విశేషాధికారాలు ఉండేవి. ఇందిర అపాయింట్ మెంట్లు, ఆమెకు అందించాల్సిన సమాచారం తదితరాలన్నీ ధావన్ నియంత్రణలో ఉండేవని చెప్పుకునేవారు. ఆపై ఇందిర హత్య వెనుక ధావన్ హస్తముందన్న వార్తలూ వచ్చాయి. రాజీవ్ ప్రధాని అయిన తరువాత ఆయన్ను పక్కన బెట్టారు. 1960లో కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా, ఆపై 1995 - 96లో గృహ నిర్మాణ శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 2012లో 74 ఏళ్ల ముదిమి వయసులో ధావన్ మరో వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ధావన్ మృతిపట్ల మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం వెలిబుచ్చారు.

  • Loading...

More Telugu News