Pawan Kalyan: ఇదేనా రియల్ టైం గవర్నెన్స్?: చంద్రబాబును విమర్శించిన పవన్
- వీధి దీపాలు వెలగకపోతే సీఎంకు తెలుస్తాయి
- అక్రమ క్వారీల గురించి మాత్రం తెలియదా?
- అక్రమ మైనింగ్ అరికట్టకపోతే జనసైనికులే మూయిస్తారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేసినప్పుడే హత్తిబెళగల్ క్వారీ పేలుడు లాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నారు. సచివాలయంలో కూర్చొని గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటాను, మాది రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి నిజానికి గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలియదని విమర్శించారు.
కర్నూలు జిల్లాలోని హత్తిబెళగల్ లోని క్వారీలో పేలుడు జరిగిన ప్రదేశాన్ని పవన్ ఈరోజు పరిశీలించారు. వీధిలో దీపాలు వెలగకపోయినా తనకు తెలిసిపోతుందనే చంద్రబాబుకు అక్రమ క్వారీలు, మైనింగ్ గురించి తెలియదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ ను ప్రభుత్వం తక్షణం నిలిపివేయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనసైనికులే వాటిని మూయిస్తారని హెచ్చరించారు.క్వారీలో పేలుడు ఘటనలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హత్తిబెళగల్ గ్రామం వెళ్లి అక్కడి స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ, హత్తిబెళగల్ క్వారీ పేలుడు ఘటన దురదృష్టకరమని, సీఎం చంద్రబాబు ప్రజాసమస్యలను గాలికొదిలేసి.. మంత్రులను, టీడీపీ కార్యకర్తలను వెనకేసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అక్రమ మైనింగ్ జరుగుతుంటే మైనింగ్ శాఖ మంత్రి, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 1300 క్వారీలకు అనుమతులు ఇచ్చారని, మరో 600 వరకు అక్రమ క్వారీలు నడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ ను పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని, ఇళ్లు బీటలు పడుతున్నాయని, ప్రాణాలు పోతున్నా పాలకులకి పట్టడం లేదని విమర్శించారు. ఇంకా అక్కడ కాలుతూనే ఉందంటే ఏ స్థాయిలో ప్రమాదం జరిగిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా మాత్రమే కాకుండా ముందు ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధితులకు ‘జనసేన’ అండగా ఉంటుందని... ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఈ ప్రాంతంలో 15 ఏళ్లుగా అక్రమంగా మైనింగ్ జరుగుతుందని హత్తిబెళగల్ ప్రజలు విజ్ఞప్తులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమౌతుందని అన్నారు.ప్రభుత్వం క్వారీ యజమానులకు వత్తాసు పలకకుండా, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. స్థానిక యువకులు కొన్ని సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారని, త్వరలోనే కర్నూలు జిల్లా పర్యటనలో సమస్యలపై స్పందిస్తానని చెప్పారు. బాధ్యతాయుతమైన మైనింగ్ విధానం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. అనంతరం కర్నూలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్వారీ బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.
కాగా, పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు. కర్నూలు నగరంలోని టోల్‌గేట్ నుంచి హనుమాన్ సర్కిల్ వరకు బైక్, ఆటోలతో ర్యాలీ చేపట్టారు. కర్నూలు నుంచి ఆలూరు వెళ్లే దారి పొడవునా ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నాయకుడిని పూల వర్షంలో ముంచెత్తారు. జనసేనాని సైతం తన కోసం రోడ్లపై ఎదురుచూసిన అభుమనౌఆలను పలకరించి, ఆత్మీయ కరచాలనం చేసి ముందుకు సాగారు.