Rajasthan: ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రూ. 11 లక్షలు కట్టాల్సిందేనట.. రాజస్థాన్ పంచాయతీ తీర్పు!
- మూడేళ్ల వయసులోనే నిశ్చితార్థం
- చదువు, సంధ్యలు లేకుండా పెరిగిన బాలుడు
- పెళ్లికి నిరాకరించడంతో దారుణమైన తీర్పు
తెలిసీ తెలియని వయసులో పెద్దలు ఓ బాలుడితో నిశ్చితార్థం చేయగా, వయసు వచ్చిన తరువాత నిరక్షరాస్యుడైన అతనితో తనకు పెళ్లి వద్దని చెప్పినందుకు ఓ అమ్మాయిపై దారుణమైన తీర్పిచ్చిందో రాజస్థాన్ పంచాయతీ. మరిన్ని వివరాల్లోకి వెళితే, నాగౌర్ జిల్లాలోని పీల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాంసెడ్ గ్రామంలో నౌరత్ బావ్లా కు చాలా ఏళ్ల క్రితం మూడేళ్ల బాలికతో నిశ్చితార్థాన్ని జరిపించారు. ఆ బాలిక ఇప్పుడు పెరిగి పెద్దకాగా, పెళ్లి చేసేందుకు పెద్దలు ప్రయత్నించారు.
అయితే, ఏ మాత్రం చదువు, సంధ్య లేని నౌరత్ తో జీవితాన్ని పంచుకునేందుకు ఆమె నిరాకరించింది. దీంతో విషయం పంచాయతీ పెద్దల ముందుకు వెళ్లింది. పెళ్లిని వద్దన్నందుకు ఆ కుటుంబాన్ని సమాజం నుంచి వెలివేసిన పంచాయతీ, వారితో మాట్లాడితే రూ. 5,100 జరిమానా చెల్లించాలని తీర్పిచ్చింది. ఇక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే వారు ఎవరైనా రూ. 11 లక్షల మొత్తాన్ని జరిమానాగా చెల్లించాలని కూడా పంచాయతీ ఆదేశించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి పంచాయతీ పెద్దలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.