Undavalli Arunkumar: ఆరోజూ చెప్పాను, నేడూ చెబుతున్నా... జగన్ పై వేసిన కేసులేవీ జైలుకు పంపేవి కాదు: ఉండవల్లి
- ఏ కేసూ నిలబడదన్న ఉండవల్లి అరుణ్ కుమార్
- ఆర్వోసీ వద్ద ఉన్న సమాచారమే చార్జ్ షీట్ లో ఉంది
- అధికారుల విచారణలో తేలిందేమీ లేదన్న ఉండవల్లి
వైఎస్ జగన్ పై ప్రస్తుతం విచారణలో ఉన్న కేసులేవీ ఆయన్ను జైలుకు పంపించేంత పెద్ద కేసులేవీ కాదని, ఈ విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని, ఇప్పుడూ అదే మాటకు కట్టుబడివున్నానని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. జగన్ పై దాఖలైన చార్జ్ షీట్లలో ఉన్నదంతా ఆర్వోసీ (రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్) వద్ద ఉన్న సమాచారమేనని చెప్పిన ఉండవల్లి, ఏదైనా తప్పు జరిగిందని తేలితే కేవలం జరిమానా మాత్రమే పడుతుందే తప్ప, జైలుకు వెళ్లే పరిస్థితులు తలెత్తవని ఆయన స్పష్టం చేశారు.
చార్జ్ షీట్ లోని సమాచారంలో ఏదీ విచారించి కనుగొన్నది కాదని చెప్పిన ఆయన, తన ఉద్దేశంలో జగన్ నేరస్తుడని చెప్పే ఆరోపణలు, దాన్ని నిరూపించే ఆధారాలు ఈ కేసుల్లో లేవన్నది తన అభిప్రాయమని ఉండవల్లి చెప్పారు. ఇండియాలో ఇంతవరకూ 'క్విడ్ ప్రొకో' అన్న కేసు నిరూపితమైన ఘటన ఒక్కటి కూడా లేదని గుర్తు చేశారు.
ఓ ఉదాహరణను వివరిస్తూ, "మురళీ అనే వ్యక్తి ఫ్యాక్టరీకి 1 టీఎంసీ నీరిచ్చారు. అందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీలో ఆయన పెట్టుబడులు పెట్టారు. ఇది క్విడ్ ప్రొకో అంటున్నారు. నిజంగా అలా జరిగివుంటే అందులో ప్రధాన ముద్దాయి ఎవరైనా ఉంటే అది రాజశేఖరరెడ్డి. జగన్ బెనిఫిషరీ. అందుకే ఇది చాలా తప్పుడు కేసు. నావద్ద ఆధారాలు ఉన్నాయి. మురళికి వన్ టీఎంసీ నీరిచ్చినప్పుడే, అరుణ్ కు టూ టీఎంసీల నీరిచ్చారు. అప్పారావుకు త్రీ టీఎంసీల నీరిచ్చారు. అవన్నీ జీవోలు ఉన్నాయి. వాళ్లెవరూ పెట్టుబడులు పెట్టలేదు. మురళి అనేవాడు పెట్టుబడి పెడితే, అది యాదృచ్చికంగా జరిగిందే తప్ప... అలాకాకుంటే వాళ్లు కూడా పెట్టాలిగా?" అని అన్నారు.