fish: గర్భిణులు చేపలు తినకుంటే ప్రమాదమే!
- గర్భం దాల్చిన తొలినాళ్లలో చేపలు తినాల్సిందే
- శరీరంలో ఒమెగా ఫ్యాటీ-3 యాసిడ్స్ లేకుంటే బిడ్డకు నష్టం
- చేపలు తినకుంటే ముందస్తు ప్రసవం
ఆరోగ్యానికి చేపలు చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గర్భిణులకు చేపలు ఎంత మేలు చేస్తాయో తాజా పరిశోధనలో మరోమారు వెల్లడైంది. గర్భం దాల్చిన తొలి నాళ్లలో చేపలు తినకుంటే ముందస్తు ప్రసవం అయ్యే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో తేలింది. బోస్టన్‌లోని హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, కోపెన్‌హగెన్‌లోని స్టేటెన్స్ సీరమ్ ఇనిస్టిట్ట్యూట్ నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెలుగుచూసింది.
గర్భం దాల్చిన తొలినాళ్లలో చేపలను ఆహారంగా తీసుకోని వారిలో శిశువుకు హాని జరిగే అవకాశం ఉందని పరిశోధనకారులు తేల్చారు. ఇతరులతో పోల్చినప్పుడు వీరిలో నెలలు నిండకుండానే ప్రసవించే ముప్పు పది రెట్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. నెలలు నిండకుండా ప్రసవం అయిన 376 మంది, సాధారణ ప్రసవం అయిన 348 మంది మహిళల రక్తనమూనాలను విశ్లేషించడం ద్వారా పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు. నెలలు నిండకుండానే ప్రసవించిన మహిళల్లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ 1.6 శాతం తక్కువగా ఉన్నాయని తెలిపారు. కాబట్టి గర్భం దాల్చిన తొలి వారం నుంచి చేపలను సరిపడా మోతాదులో తీసుకోవాలని సూచించారు.