sehwag: పాఠ్య పుస్తకాలపై వీరూ గుస్సా.. 'పిల్లలకు ఇలాంటి చెత్త బోధిస్తారా?' అంటూ ఆగ్రహం
- ఉమ్మడి కుటుంబంపై బుక్ లో తప్పుడు వివరణ
- అధికారుల్ని నిందించిన వీరూ
- ఇలాంటి చెత్త ఇంకా చాలా ఉందని వ్యాఖ్య
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మాజీ క్రికెటర్, డాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ టెక్ట్స్ బుక్ లోని కథనంపై మండిపడ్డాడు. అధికారులు ఏమాత్రం చెక్ చేయకుండా ఇలాంటి పుస్తకాల ముద్రణకు అనుమతి ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి చెత్తను మన పిల్లలు చదవాలా? అని ప్రశ్నించాడు.
ఈ రోజు ఓ టెక్ట్స్ బుక్ కు సంబధించిన క్లిప్ ను వీరూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అందులో ఉమ్మడి కుటుంబం అనే హెడ్డింగ్ కింద ‘ఉమ్మడి కుటుంబంలో తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ, ఇంకా చాలా మంది పిల్లలు ఉంటారు. ఉమ్మడి కుటుంబం సంతోషకరమైన జీవితాన్ని ఎంజాయ్ చేయలేదు’ అని ఉంది.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సెహ్వాగ్.. ఇప్పుడున్న పాఠ్య పుస్తకాల్లో ఇలాంటి చెత్త చాలా ఉందని వ్యాఖ్యానించాడు. విద్యాశాఖ అధికారులు సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఇలాంటి పుస్తకాలు మార్కెట్ లోకి వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు.