govt jobs: ఖాళీలున్నా భర్తీ చేయలేదు.. దేశంలో 24 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ!
- పార్లమెంటుకు తెలిపిన కేంద్రం
- విద్యారంగంలో ఖాళీలు అత్యధికం
- పోలీస్ శాఖ పరిస్థితి అంతంతే!
మంచి జీతం, సమాజంలో గౌరవం, ఉద్యోగ భద్రత.. ప్రభుత్వ ఉద్యోగాలను ఆకర్షణీయంగా మార్చిన అంశాలివి. ఓవైపు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం యువతీయువకులు అహర్నిశలు కష్టపడుతుంటే.. మరోవైపు ప్రభుత్వాలేమో అసలు ఉద్యోగాలు లేవనీ, ఉన్నవాళ్లే ఎక్కువయ్యారని చెబుతుంటాయి. తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ కల్పన విషయంలో వాస్తవాలు వెల్లడించడం లేదని తేలింది. దేశంలో వేర్వేరు ప్రభుత్వ విభాగాల్లో భారీగా ఖాళీలు ఉన్నాయని వెల్లడయింది.
2018, జూలై నాటికి దేశంలో 23.8 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశాల సందర్భంగా వెల్లడించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలోని స్కూళ్లలో 10.1 లక్షల మంది ప్రాథమిక, సెకండరీ టీచర్ల కొరత ఉంది. అలాగే పోలీసుల్లో 5.4 లక్షలు, రైల్వేల్లో 2.4 లక్షలు, అంగన్ వాడీ విభాగంలో 2.2 లక్షల మంది ఉద్యోగుల కొరత ఉంది.
అంతేకాకుండా ఆర్మీలో 62 వేలు, పారామిలటరీ దళాల్లో 61 వేలు, పోస్టల్ శాఖలో 54 వేల మంది సిబ్బంది అవసరం ఉంది. మరోవైపు దేశానికి పట్టుకొమ్మగా ఉన్న ఆరోగ్య రంగంలో దాదాపు 1.5 లక్షల ఖాళీలు ఉండగా.. కోర్టుల్లో 5,853 ఖాళీలు ఉన్నాయి.