Telugudesam: స్పెషల్ స్టోరీ: తరం మారింది... ఏపీ రాజకీయాల్లో 'సై' అంటున్న వారసులు!

  • వారసుల రంగ ప్రవేశానికి నేతల అంగీకారం
  • తమ కుమారులకు టికెట్లు కావాలని ఒత్తిడి
  • 13 జిల్లాల్లో దాదాపు 20 మంది వారసులు

తెలుగుదేశం పార్టీ పుట్టి మూడున్నర దశాబ్దాలు అయింది. నాడు కార్యకర్తలుగా పార్టీలో ప్రవేశించి, నేడు నేతలుగా ఉన్న వారి వారసులు ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం కోసం వేచి చూస్తున్నారు. టీడీపీలో ఉన్న సీనియర్ నేతల కుమారులు, కుమార్తెలు వచ్చే ఎన్నికల్లో తమకు సీట్లు కావాలని ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు కుమారుడు లోకేష్ సహా, పలువురు సీనియర్ రాజకీయ నాయకుల వారసులు రంగ ప్రవేశం చేయడంతో, గడచిన రెండు దశాబ్దాల కాలంగా రాణిస్తున్న నేతల పుత్రరత్నాలు తమ అరంగేట్రానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు వారసులు ఈ దఫా జరిగే అసెంబ్లీ ఎన్నికలతో తొలిసారి తమ సత్తా చాటాలని చూస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పోటీలో నిలబడి, ప్రత్యర్థులతో కలబడి అసెంబ్లీలో 'అధ్యక్షా' అనాలన్నదే వీరి ప్రస్తుత టార్గెట్. 2019 ఎన్నికల హడావుడి అప్పుడే మొదలుకాగా, గెలుపోటముల సంగతిని పక్కనబెడితే, పోటీకి 'సై' అంటున్నారు యువ నేతలు. కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో పోలిస్తే, టీడీపీలో యువనేతల ఉత్సాహం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నాలుగేళ్లూ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న తమ తండ్రులకు చేదోడు వాదోడుగా ఉన్న వాళ్లు ఈ దఫా తామే రంగంలోకి దిగేందుకు పావులు కదుపుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఈ పరిస్థితి ఉండగా, తమ వారసులను ప్రజలకు పరిచయం చేసేందుకు ఇదే సరైన సమయమని తండ్రులు భావిస్తుండటం గమనార్హం.

శ్రీకాకుళం నుంచి పరిశీలిస్తే, గౌతు శ్యామ్ సుందర్ కుమార్తె గౌతు శిరీష ఈ దఫా టికెట్ ను ఆశిస్తున్నారు. విశాఖపట్నంలో మంత్రి అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ తనకు టికెట్ కావాలని అడుగుతున్నారు. తండ్రికి అసెంబ్లీ టికెట్, తనకు పార్లమెంట్ టికెట్ ఇవ్వాలన్నది ఆయన డిమాండ్. ఇదే జిల్లాలో బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు (ఎంపీ రామ్మోహన్ నాయుడు బావమరిది) పోటీకి సై అంటున్నారు. తండ్రి, బావల అండ తనను గెలిపిస్తుందన్నది ఆయన ఆలోచన. విజయనగరం జిల్లాకు వస్తే, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి ఎన్నికల్లో పోటీకి తనకు అవకాశం లభిస్తుందని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఇక తూర్పు గోదావరి జిల్లాకు వస్తే, వైకాపా నేతగా ఉండి, టీడీపీలోకి ఫిరాయించిన జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్, ఎమ్మెల్సీ అప్పారావు కుమారుడు వాసు తదితరులు ఈ దఫా టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ నేత బోళ్ల బుల్లిరామయ్య మనవడు బోళ్ల రాజీవ్ ఏలూరు ఎంపీ టికెట్ తనకు కావాలని ఇప్పటికే ఖర్చీఫ్ వేశారు. కృష్ణా జిల్లాలో దేవినేని వారసులు అవినాష్, చందూలు ఇప్పటికే ప్రజల్లో తిరుగుతున్న సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా విషయానికి వస్తే స్పీకర్ కోడెల వారసుడిగా సత్తెనపల్లి లేదా నరసరావుపేట టికెట్ తనకు కావాలని కోడెల శివరాం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎంపీ రాయపాటి తనయుడు రంగబాబు కూడా తన రాజకీయ అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నారు.

ప్రకాశం జిల్లాలో వారసుల సంఖ్య అధికంగా ఉంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ అద్దంకి టికెట్ ను ఆశిస్తుండగా, ప్రస్తుత మంత్రి శిద్ధా రాఘవరావు కుమారుడు సుధీర్ తనవంతు ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. ఒకవేళ అద్దంకి టికెట్ కుదరకపోతే, మరో నియోజకవర్గం నుంచైనా పోటీకి వెంకటేష్ సై అంటుండగా, కనిగిరి లేదా దర్శి టికెట్ తనకు కావాలని సుధీర్ డిమాండ్ చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో ఆనం వివేక కుమారుడు రంగా మయూర్ రెడ్డి ఇప్పటికే రంగంలోకి దిగి, తనకు అభ్యర్థిత్వం లభించడం ఖాయమని ప్రచారం చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి బొజ్జల కుమారుడు సుధీర్ రెడ్డి ఈ దఫా తానే బరిలో ఉంటానని కార్యకర్తలకు చెబుతూ, ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకం కావాలని ప్రయత్నిస్తున్నారు. దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి వారసులుగా వచ్చేందుకు జగదీష్, భాను సిద్ధంగా ఉండగా, వీరిలో ఒకరికి టికెట్ ఖాయమని తెలుస్తోంది.

ఇక అనంతపురంలో మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ కు టికెట్ ఇప్పటికే ఖాయమైంది. మరో నేత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ కూడా ఈ దఫా ఎన్నికల్లో తన సత్తా చూపుతానని చెబుతున్న పరిస్థితి. కర్నూలు జిల్లా విషయానికి వస్తే, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్, ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు భరత్ పోటీకి తాము కూడా సిద్ధమని చెబుతున్నారు.

మొత్తం ఏపీలో దాదాపు 20 మంది వరకూ యువనేతలు ఈసారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తుండగా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వీరిలో ఎంతమందిపై కరుణ చూపిస్తారన్నది మరో ఏడెనిమిది నెలల్లో తేలుతుంది.

  • Loading...

More Telugu News