Hyderabad: కాకినాడలో పట్టుబడిన 'న్యూ సెంచరీ' స్కూల్ అధినేత!
- 2న కూకట్ పల్లిలో కుప్పకూలిన స్కూల్ షెడ్
- ఇద్దరు బాలికల మరణం తరువాత యజమాని వెంకట్ అదృశ్యం
- ఓ ఉద్యోగి సమాచారంతో అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్, కూకట్ పల్లిలో షెడ్డు కుప్పకూలి ఇద్దరు విద్యార్థినులు మృతి చెందిన ఘటనలో అజ్ఞాతంలో ఉన్న న్యూ సెంచరీ పాఠశాల అధినేత వెంకట్ ను పోలీసులు కాకినాడలో అరెస్ట్ చేశారు. 2వ తేదీన స్కూల్ షెడ్ కుప్పకూలగా, అప్పటి నుంచి వెంకట్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మూడు బృందాలను ఏర్పాటు చేసి అతని ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులకు, స్కూల్ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అందించిన సమాచారం కీలక ఆధారాలను ఇచ్చింది. వెంకట్ కాకినాడలో ఉన్నాడని తెలుసుకుని అరెస్ట్ చేశామని, ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నామని కూకట్ పల్లి సీఐ ప్రసన్నకుమార్ తెలిపారు.
కాగా, ఘటనలో మృతిచెందిన ఇద్దరు బాలికల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చేందుకు వెంకట్ అంగీకరించారని కూకట్ పల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన నరేష్, లిఖితలు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆ ఖర్చులన్నీ పాఠశాల యాజమాన్యం భరిస్తుందని ఆయన తెలిపారు.