Yadadri Bhuvanagiri District: యాదాద్రి నుంచి సిద్ధిపేటకు వ్యభిచార లింకు... పలువురు అమ్మాయిలు ఉన్నట్టు అనుమానం!

  • పలు ప్రాంతాలకు విస్తరించిన పాపపు కూపం
  • యాదాద్రి ఘటనతో మేలుకున్న పోలీసులు
  • పలు ప్రాంతాల్లో తనిఖీలు

యాదగిరి గుట్టలో వెలుగుచూసిన సెక్స్ రాకెట్ సిద్ధిపేట జిల్లాలోని పలు ప్రాంతాలకు కూడా విస్తరించిందని, బాలికలను అపహరించి తీసుకు వచ్చిన ముఠాలు సిద్ధిపేట, కొడకండ్ల, రాంచంద్రాపూర్ తదితర ప్రాంతాల్లోనూ వారిని పెంచుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. సిద్ధిపేటలోని కోమటిచెరువు సమీపంలో దశాబ్దాలుగా వ్యభిచార గృహాలు నడుస్తున్నాయి. ఇంతకాలం చూసీ చూడనట్టు ఉన్న పోలీసులు, యాదాద్రి ఘటనలతో మేలుకున్నారు. వరుస దాడులు జరుపుతున్నారు. అపహరించి తీసుకువచ్చిన ఎంతో మంది అమ్మాయిలు ఈ ప్రాంతంలో ఉండి ఉండవచ్చని, వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు.

ఈ ప్రాంతానికి యాదగిరిగుట్ట, చిలకలూరిపేట, పెద్దాపురం తదితర ప్రాంతాలకు లింకులున్నాయని, ఇక్కడి అమ్మాయిలను అక్కడికి, అక్కడి అమ్మాయిలను ఇక్కడికి మార్చి మార్చి తెస్తుంటారని నిర్ధారణకు వచ్చిన పోలీసులు, ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి నిఘాను పెంచినట్టు తెలుస్తోంది. ఇక మెదక్ జిల్లా నార్సింగి మండలంలోనూ గతంలో వ్యభిచార దందా సాగిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్న పోలీసులు, అక్కడ ఎవరైనా కిడ్నాపైన చిన్నారులు పెరుగుతున్నారా? అన్న విషయాన్ని తేల్చే పనిలో పడ్డారు. అనుమానం ఉన్న అన్ని ప్రాంతాలపైనా నిఘా పెట్టామని, తమ తనిఖీలకు ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Yadadri Bhuvanagiri District
Siddipet District
Prostitution
  • Loading...

More Telugu News