Rajya Sabha: కొత్త ఎంపీలకు వెంకయ్య వార్నింగ్.. అలా చేసి తనకు కోపం తెప్పించొద్దన్న రాజ్యసభ చైర్మన్!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-f1fc3bbd9856bdb4d45bb03dbe4d4049ed5b6f99.jpg)
- కొత్త సభ్యుల కోసం ఓరియంటేషన్ క్లాసులు ప్రారంభం
- గంటపాటు వివిధ అంశాలను వివరించిన వెంకయ్య
- రాజకీయాలు బయట మాత్రమే చేసుకోవాలని సూచన
కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు విలువైన సూచనలు చేశారు. రాజ్యసభ కార్యకలాపాల గురించి అవగాహన కల్పించేందుకు కొత్త సభ్యుల కోసం రెండు రోజుల ఓరియంటేషన్ ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు. దీనిని ప్రారంభించిన అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడారు. దాదాపు గంటపాటు మాట్లాడిన ఆయన కొత్తగా ఎన్నికైన సభ్యులకు సభా కార్యకలాపాల గురించి వివరించారు.
సభలోకి వచ్చేముందు రాజకీయాలను వదిలేయాలని సూచించారు. రాజకీయాలు అన్నీ బయటేనని, లోపలికి వచ్చాక ప్రజా సంక్షేమం గురించి మాత్రమే మాట్లాడాలన్నారు. సభ సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సభలో నాణ్యమైన చర్చలు జరిగేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందరూ క్రమశిక్షణగా ఉంటారని, సభ నిబంధనలను పాటిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. సభలో గందరగోళం సృష్టించినా, నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించినా తనకు కోపం వస్తుందని హెచ్చరించారు