Mamata Banerjee: ‘యూ టర్న్ దీదీ’.. మమతా బెనర్జీ పేరు మార్చిన బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్!

  • 2005లో ఎన్ఆర్‌సీకి మమత మద్దతు
  • తాజాగా యూ టర్న్
  • సీఎంపై విమర్శలు తీవ్రతరం చేసిన బీజేపీ

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బీజేపీ యూత్ వింగ్ అధ్యక్షురాలు, లోక్‌సభ ఎంపీ పూనమ్ మహాజన్ కొత్త పేరు పెట్టారు. ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్‌సీ)పై మాట మార్చినందుకు గాను  మమతను ‘యూటర్న్ దీదీ’గా అభివర్ణించారు. ఆగస్టు 11న కోల్‌కతాలో నిర్వహించనున్న ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ జాతి వ్యతిరేక విధానాలను ఎండగడతామని ఆమె పేర్కొన్నారు.

ఆగస్టు 11న బీజేపీ చీఫ్ అమిత్ షా ఆధ్వర్యంలో కోల్‌కతాలో నిర్వహించనున్న ర్యాలీలో 2 లక్షల మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొననున్నట్టు పూనమ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో బలపడడమే లక్ష్యంగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 42 లోక్‌సభ స్థానాలుండగా గత ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండింటిలోనే విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో కనీసం 22 స్థానాల్లో విజయ ఢంకా మోగించాలని షా లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ర్యాలీ సాక్షిగా తృణమూల్ కాంగ్రెస్‌పై విరుచుకుపడాలని బీజేపీ యోచిస్తోంది. జాతీయ పౌర రిజస్టర్ నుంచి 14 లక్షల మంది అస్సామీల పేర్లు గల్లంతవడాన్ని మమత తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారంలో ఎన్ఆర్‌సీ ముసాయిదా పబ్లిక్ కానుంది. దీని తర్వాతే ర్యాలీ జరగనుండడంతో మమతపై నిప్పులు చెరగాలని బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది.

మరోవైపు, ఎన్‌ఆర్‌సీతో 14 లక్షల మంది బారత పౌరసత్వం కోల్పోయే ప్రమాదంలో పడడంపై మమత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ఇలాగే కొనసాగితే దేశంలో పౌర యుద్ధం, రక్తపాతం తప్పదని హెచ్చరించారు. కాగా, 2005లో ఎన్ఆర్‌సీకి మద్దతు ఇచ్చిన మమత తాజాగా మాట మార్చడంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. ఆమె రెండు నాల్కల ధోరణికి ఇది నిదర్శనమని పేర్కొంది. ఈ కారణంగా ఆమెకు ‘యూటర్న్ దీదీ’ అని పేరుపెట్టి విమర్శలకు దిగింది. 

  • Loading...

More Telugu News