meteor: అమెరికా ఎయిర్ బేస్ వద్ద పడిన భారీ ఉల్క.. నోరు మెదపని సైన్యం!
- గ్రీన్ ల్యాండ్ సమీపంలో ఘటన
- రాడార్ సైతం గుర్తించకపోవడంపై ఆశ్చర్యం
- అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రజలు
తమ ప్రాంతంలో చోటు చేసుకున్న ఓ ఉల్కాపాతం గురించి అగ్రరాజ్యం అమెరికా మౌనంగా వుండడం అనుమానాలకు తావిస్తోంది. తాజాగా అంతరిక్షం నుంచి ఓ ఉల్క గ్రీన్ ల్యాండ్ సమీపంలోని అమెరికా తులే వాయుసేన బేస్ సమీపంలో పడింది. సెకనుకు దాదాపు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఈ వస్తువు భూమిని తాకడంతో 2.1 కిలోటన్నుల శక్తి ఉత్పత్తి అయింది.
అయితే ఈ ప్రాంతంలోనే అమెరికాకు చెందిన మిస్సైల్ హెచ్చరిక రాడార్ వ్యవస్థ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పడింది కేవలం ఉల్కేనా? లేక ఏలియన్స్ నౌక క్రాష్ ల్యాండింగ్ అయిందా? అన్న అనుమానాలు బయలుదేరాయి. అమెరికా వాయుసేన ఈ విషయమై కనీసం స్పందించకపోవడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.
కాగా, రాడార్ వ్యవస్థ ఉన్నప్పటికీ ఉల్కను గుర్తించలేకపోవడం ఏంటని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా అధికారులు స్పందిస్తేనే ఈ పుకార్లకు అడ్డుకట్ట పడుతుంది.