Facebook: వివాహితతో ఫేస్ బుక్ పరిచయం.. ప్రేమ.. చివరకి ముగ్గురి ఆత్మహత్య!

  • పెళ్లయిన యువతిని ప్రేమించిన వెంకటేశ్
  • విషయం తెలిసి ఆత్మహత్య చేసుకున్న యువతి భర్త
  • మనస్తాపంతో గోదావరిలో దూకిన యువతి
  • ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక ఉరేసుకున్న వెంకటేశ్

పెళ్లయిన యువతి ఫేస్ బుక్ లో పరిచయమై, ఆ స్నేహం ప్రేమగా మారి, మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం పోలీస్ క్వార్టర్ లో నివాసం ఉంటున్న కంపా వెంకటరమణ కుమారుడు కంపా వెంకటేష్ (23) తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని విచారించిన పోలీసులకు గత నెలలో జరిగిన రెండు ఆత్మహత్యల కొనసాగింపుగా ఇది జరిగిందంటూ విస్తుపోయే నిజాన్ని వెలికితీశారు.

వెంకటేశ్ కు రాజమహేంద్రవరం వాంబే కాలనీకి చెందిన ఓ వివాహితతో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఓ బ్యూటీ పార్లర్ లో పనిచేస్తున్న ఆమె, సాయి అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆపై వెంకటేశ్ తో ఆమె స్నేహం ప్రారంభించగా, ఆమెపై గుండెల నిండా ప్రేమను పెంచుకున్నాడు. ఈ క్రమంలో సాయికి ఫోన్ చేసిన వెంకటేశ్, "నీ భార్యను నేను పెళ్లి చేసుకుంటా. ఆమెను వదిలెయ్యి" అని చెప్పాడు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయి, గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆపై తన భర్త మరణానికి నువ్వే కారణమంటూ వెంకటేశ్ ను నిందించిన బాధితురాలు, తాను కూడా ప్రాణాలు వదిలేస్తానని చెప్పింది. దీంతో భయపడిన వెంకటేశ్, ఆమెను కలిసి, తన బైక్ పై రాజమహేంద్రవరం రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ వారు ఘర్షణ పడగా, అప్పుడే ఆమె గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఈ కేసులో కొవ్వూరు పోలీసులు వెంకటేశ్ ను విచారించారు కూడా. తాను ఎంతగానో ప్రేమించిన ప్రియురాలు చనిపోయిందన్న ఆవేదలో ఉన్న వెంకటేశ్, నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలిని సందర్శించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Facebook
Venkatesh
Sai
East Godavari District
West Godavari District
Rajamahendravaram
Sucide
  • Loading...

More Telugu News