kcr: ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరిన కేసీఆర్.. మోదీతో భేటీకానున్న సీఎం
- మూడు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్
- పీఎం, పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం
- జోనల్ విధానానికి ఆమోదముద్ర వేయించుకోవడమే ప్రధాన లక్ష్యం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పయనమయ్యారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ కానున్నారు. మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జోనల్ విధానానికి ఆమోదం పొందడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. స్థానికులకు విద్య, ఉద్యోగాల కోసం టీఎస్ ప్రభుత్వం కొత్త జోనల్ విధానాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి, కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. దీన్ని ఆమోదించాలని గత నెలలోనే మోదీ, రాజ్ నాథ్ సింగ్ లను కేసీఆర్ కోరారు.
తెలంగాణలోని 31 జిల్లాల్లో యువతకు ఎక్కడికక్కడే ఉద్యోగాలు లభించేలా, 95 శాతం స్థానిక రిజర్వేషన్లతో ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. దీనికి తోడు గిరిజనులు, ముస్లింలకు రిజర్వేషన్లు, హైకోర్టు విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలపై కూడా కేసీఆర్ చర్చించనున్నారు.