Adultry Law: వివాహేతర సంబంధాల విషయంలో.. శతాబ్దంన్నర కాలం నాటి సెక్షన్ 497 సవరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్!

  • 158 ఏళ్ల నుంచి ఒకే సెక్షన్ కింద శిక్షలు
  • పురుషుడిది మాత్రమే తప్పంటున్న సెక్షన్ 497
  • మార్చే సమయం వచ్చిందని అభిప్రాయపడుతున్న ధర్మాసనం
  • శిక్షార్హమైన నేర జాబితా నుంచి తొలగించే అవకాశం

ఎప్పుడో బ్రిటీష్ వారు పరిపాలించిన కాలం నుంచి ఇండియాలో అమలవుతున్న భారత శిక్ష్మాస్మృతి సెక్షన్ 497ను సవరించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓ వివాహిత పురుషుడు వివాహిత స్త్రీతో సంబంధం పెట్టుకుని పట్టుబడితే, ఇంతకాలం పురుషుడికి ఐదేళ్ల వరకూ జైలు శిక్షను విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ మహిళను కేవలం బాధితురాలిగా మాత్రమే పరిగణిస్తూ, ఎటువంటి కేసూ నమోదు చేసే వీలుండదు. ఈ సెక్షన్ ను సవరించాలని దాఖలైన పిటిషన్ పై గత కొన్ని రోజులుగా వాదనలు వింటున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం, సెక్షన్ ను మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ సెక్షన్ చెల్లుబాటును విచారించాలని షైనే జోసఫ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై వాదనలు విన్న ధర్మాసనం, వివాహేతర సంబంధం స్త్రీ, పురుషుల అవసరార్థం ఏర్పడుతుందని, విడాకులు తీసుకోవాలని భావించే వారు మరొకరితో సంబంధం పెట్టుకుంటే చెల్లుబాటు అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఆర్టికల్ 21 కింద వివాహేతర బంధాన్ని, పురుషుడు లేదా స్త్రీ తన జీవితానికి భరోసాను పొందే హక్కులో భాగంగా చూడవచ్చని జస్టిస్ నారిమన్ అభిప్రాయపడటం గమనార్హం.

ఇదే సమయంలో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ, "ఇది మహిళలకు రక్షణగా, వివాహేతర సంబంధాలకు వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తోందే తప్ప, వాస్తవానికి ఇది మహిళా వ్యతిరేక సెక్షన్. భర్త చెప్పుచేతల్లోనే భార్య ఉండాలని చెప్పకనే చెబుతోంది. మరో వ్యక్తితో సంబంధానికి భర్త అనుమతి తప్పనిసరని కూడా చెబుతున్నట్టు ఉంది" అని అన్నారు. ఈ విచారణ తరువాత కీలకమైన సెక్షన్ 497కు సవరణ అనివార్యమని పలువురు న్యాయ నిపుణులు అంచనా వేస్తుండగా, సీనియర్ న్యాయవాది మీనాక్షీ అరోరా, న్యాయవాదులు కాళీశ్వరన్ రాజు, సునీల్ ఫెర్నాండెజ్ తదితరులు ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నారు.

Adultry Law
Section 497
Supreme Court
  • Loading...

More Telugu News