Tamilnadu: తొలుత కావాలనే ఫెయిల్ చేస్తారు... ఆపై డబ్బు తీసుకుని పాస్ చేస్తారు... అన్నా యూనివర్శిటీ మాయాజాలం!

  • రూ. 240 కోట్లు నొక్కేసిన అధికారులు
  • 5 లక్షల మందికి అదనపు మార్కులు
  • పది మందిపై కేసులు పెట్టిన ఏసీబీ

డబ్బుకు కక్కుర్తిపడి రీవాల్యుయేషన్ పేరిట రూ. 240 కోట్లు నొక్కేసిన అన్నా యూనివర్శిటీ అధికారుల బాగోతం మెరిట్ విద్యార్థుల ఫిర్యాదుతో బట్టబయలైంది. చాలా సంవత్సరాలుగా ఈ దందా సాగుతున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఇంజనీరింగ్, మెడికల్ తదితర కోర్సులు చదివే విద్యార్థులకు కావాలనే తక్కువ మార్కులు వేసి, ఆపై వారు రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకుంటే, పాస్ చేయిస్తామని, అదనపు మార్కులు వేస్తామని చెబుతూ లంచాల రూపంలో కోట్ల రూపాయలను అధికారులు దండుకుంటున్నారని తేలింది.

గత సంవత్సరం మొత్తం 12 లక్షల మంది సెమిస్టర్ పరీక్షలు రాయగా, వారిలో 3 లక్షల మందికి పైగా రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేశారు. ఆపై అదనంగా 73,733 మంది పాస్ అయినట్టు అధికారులు తేల్చారు. మరో 16,630 మందికి అదనపు మార్కులు రాగా, మొత్తం మీద 90,369 మంది లాభం పొందారు. ఈ దందాపై ఫిర్యాదులు అందుకున్న ఏసీబీ అధికారులు సీక్రెట్ గా విచారణ జరిపారు.

2011 నుంచి 2016 మధ్య కాలంలో 6 లక్షల మందికి రీవాల్యుయేషన్ లాభం కలిగించిందని, అయితే, వీరిలో ఎంతమంది లంచమిచ్చారన్న విషయమై ఆరా తీస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో సెమిస్టర్ ముగిసిన తరువాత రూ. 45 కోట్ల వరకూ వసూలు చేస్తూ, ఆరు సెమిస్టర్లకు గాను రూ. 240 కోట్లను వీరు నొక్కేశారని, ఈ కేసులో గత మూడేళ్లుగా ఎగ్జామినేషన్ కంట్రోలర్ గా విధులు నిర్వహిస్తున్న ఉమ సహా 10 మందిపై కేసులు పెట్టామని ఏసీబీ ఉన్నతాధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News