Hasin Jahan: వయసు విషయంలో అడ్డంగా దొరికిన టీమిండియా పేసర్ షమీ.. ఆధారాలు బయటపెట్టిన భార్య హసీన్ జహాన్!
- ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న షమీ
- ఒక్కో ధ్రువీకరణ పత్రంలో ఒక్కో పుట్టిన తేదీ
- అన్నింటినీ ఫేస్‌బుక్‌లో పెట్టిన హసీన్
ఇటీవల విమర్శల పదును తగ్గించిన టీమిండియా సీమర్ మహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మళ్లీ తెరపైకి వచ్చింది. షమీ తన వయసు విషయంలో తప్పుడు సమాచారం ఇస్తూ అందరినీ మోసం చేస్తున్నాడని ఆరోపించింది. తన ఆరోపణలకు బలం చేకూర్చేలా షమీకి చెందిన వివిధ సర్టిఫికెట్లను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేసింది. ఆమె పోస్టు చేసిన వాటిలో పది, 12వ తరగతి మార్క్స్‌షీట్లు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డు, చెక్‌బుక్ కాపీలు ఉన్నాయి.
షమీ వయసు విషయంలో అబద్ధాలు చెబుతున్నాడనేందుకు ఇవే నిదర్శనమని పేర్కొన్న హసీన్ జహాన్ వీటిని చూశాకైనా తన ఆరోపణలను నిజమని నమ్ముతారని ఆశాభవం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్‌లో ఉన్న షమీ తన వయసు 28 ఏళ్లుగా చెబుతున్నాడు. అయితే, హసీన్ బయటపెట్టిన సర్టిఫికెట్ల ప్రకారం అతడి వయసు 36 ఏళ్లు. ఇంకా విచిత్రం ఏమిటంటే.. ఒక సర్టిఫికెట్‌లో ఉన్న డేటాఫ్ బర్త్‌కు, మరో దాంట్లో ఉన్నదానికి అసలు పొంతనే లేకపోవడం.
షమీ చెబుతున్న దాని ప్రకారం.. అతడు 9, మార్చి 1990లో జన్మించాడు. టెన్త్ మార్క్స్‌షీట్‌లో 3, జనవరి 1984లో జన్మించినట్టు ఉంది. డ్రైవింగ్ లైసెన్స్‌లో 5, మే 1982లో జన్మించినట్టుగా ఉంది. ఈ రెంటింటిని పరిగణనలోకి తీసుకుంటే అతడి వయసు వరుసగా 34, 36 ఏళ్లు. అయితే, మరో మార్క్స్‌షీట్‌లో మాత్రం 3, సెప్టెంబరు 1990గా నమోదైంది. బీసీసీఐ రికార్డుల్లో ఉన్నది ఇదే. హసీన్ ఆరోపణలపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.